కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూన్ 19 : మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో 12 మంది మావోయిస్టులు జిల్లా పోలీస్, సీఆర్పీఎఫ్ 81వ, 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయినట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని హేమచంద్రాపురంలో గల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు అందిస్తున్న పునరావస పథకాల గురించి తెలుసున్న పలువురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు.
ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీకి చెందిన 12 మంది సభ్యులు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. వారిలో ఇద్దరు డివిజనల్ కమిటీ(డీవీసీ) సభ్యులు, నలుగురు ఏరియా కమిటీ సభ్యులు(ఏసీఎం), ఇద్దరు పార్టీ సభ్యులు, ఇద్దరు మిలీషియా సభ్యులు, ఇద్దరు రివల్యూషనరీ పీపుల్స్ కమిటీ(ఆర్పీసీ) సభ్యులు ఉన్నారని తెలిపారు.
డివిజనల్ కమిటీ సభ్యులైన మడకం రామ అలియాస్ మాడా అలియాస్ రఘు దక్షిణ బస్తర్ డీవీసీలోని 8వ ప్లాటూన్ ఇన్చార్జిగా వ్యవహరిస్తుండగా, మడకం భీమా అలియాస్ శ్రీకాంత్ పడమర బస్తర్ డీసీసీలోని 2వ కంపెనీకి డీవీసీఎంగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరిపై చెరో రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందని, మిగతా నలుగురు ఏరియా కమిటీ సభ్యుల్లో ఒక్కొక్కరిపై రూ.4 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.3 లక్షలు అందజేసినట్లు తెలిపారు. క్యాడర్లలో ఉన్న మావోయిస్టులకు త్వరలోనే వారికి ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు తెరిచి అందులో నగదు జమ చేస్తామని వివరించారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 294 మంది మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోయారని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) గోపతి నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ కమాండెంట్ ముఖేశ్‌కుమార్ సింగ్, 141వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ పత్రాస్ పుర్తి, చర్ల సీఐ ఆలెం రాజువర్మ, ఆర్ఐ(అడ్మిన్) బోలెం రవి, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.