
ఖమ్మం, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో గెలువబోతోందని, ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్దేననే నానుడి మరోసారి నిజం కాబోతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి మంత్రి మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు తిరుగులేదని, ఒరిజినల్ బ్రీడ్ అంతా టీఆర్ఎస్లోని ఉందని అన్నారు. నేతలతో ఏమీ కాదని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు నిర్వహించేలా ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్లనే ధాన్యం పండించిన రైతులకు నిరీక్షణ తప్పడం లేదని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులపై కక్షసాధింపు చర్యలు ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు. సింగరేణిలోని బ్లాకులు వేలం వేయడాన్ని సింగరేణి తరఫున, టీఆర్ఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించే అంశంపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాతా మధుకి వచ్చే విజయమే ప్రతిపక్షాలకు సమాధానమన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మరో 11 మంది మరణించడం బాధాకరమన్నారు. రావత్ మరణం దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సంతాప సూచికంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.
క్రాస్ బ్రీడ్లు వస్తుంటాయ్.. పోతుంటాయ్..
టీఆర్ఎస్ అంటేనే ఒరిజినల్ బ్రీడ్ అని మంత్రి అన్నారు. ఎన్ని క్రాసింగ్‌లు జరిగినా, క్రాస్ బ్రీడ్లు వచ్చినా ఏమీకాదని స్పష్టం చేశారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంపై ఇక యుద్ధమే: ఎంపీ నామా
కేంద్ర ప్రభుత్వానికి ప్రజావ్యతిరేక విధానాలని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆ విధానాలపై టీఆర్ఎస్ ఇక యుద్ధం చేస్తుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందని విమర్శించారు. సింగరేణిలో నాలుగు బ్లాకులను కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తుండడాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు.
ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: మధు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు పేర్కొన్నారు. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికలు ముగిసే రోజు వరకు అందరినీ సమన్వయం చేస్తూ తన విజయం కోసం కీలకపాత్ర పోషించిన మంత్రి అజయ్, ఎంపీ నామా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రైవేటీకరణను సహించం: ఎమ్మెల్యే సండ్ర
సింగరేణిలో నాలుగు బ్లాకులను ప్రైవేట్‌పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సత్తుపల్లి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి సింగరేణికి భూములు అప్పగించామన్నారు. కేంద్రం సింగరేణి బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, మేయర్ నీరజ, సూడా చైర్మన్ విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, కమర్తపు మురళి, తాజుద్దీన్, వీరూనాయక్ తదితరులు పాల్గొన్నారు.