
నాలుగు బొగ్గు బ్లాక్‌ల వేలంపై నిరసన
సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట కార్మికుల వంటావార్పు
గళం విప్పిన టీబీజీకేఎస్, జాతీయ సంఘాలు
ప్రభుత్వ విప్ రేగా,ప్రజాప్రతినిధుల మద్దతు
గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, రవాణా
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేయడాన్ని నిరసిస్తూ కార్మికులు మూడు రోజుల పాటు నిర్వహించిన సమ్మె గ్రాండ్ సక్సెస్ అయ్యింది.. ఉద్యోగులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారి నినాదాలతో బొగ్గు బావులు ప్రతిధ్వనించాయి. శనివారం కొత్తగూడెంలోని సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్, జాతీయ సంఘాల నాయకులు వంటావార్పు నిర్వహించారు. సమ్మె కారణంగా మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.. గనులన్నీ బోసి పోయి దర్శనమిచ్చాయి.. అత్యవసర సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు..
కేంద్ర ప్రభుత్వం సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న యత్నాలను తిప్పికొట్టేందుకు కార్మిక సంఘాల నాయకులు 72 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మూడోరోజు శనివారం అన్ని ఏరియాల్లో సమ్మె దద్దరిల్లింది. కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి పరిధిలోని నాలుగు గనులను వేలం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా మొదటి షిప్టులో మొత్తం 27,559 మందికి 22,986 మంది, రెండో షిప్టులో 6,885 మందికి 5458 మంది సమ్మెలో పాల్గొన్నారు. అన్ని ఏరియాల నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా సమ్మె కారణంగా శనివారం కేవలం 30 వేల టన్నుల బొగ్గును మాత్రమే రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో సంస్థ రూ.60 కోట్లు నష్టపోయింది. కార్మికులు వేతనాల రూపంలో రూ.15 కోట్లు నష్టపోయారు. సమ్మెలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)తో పాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.
మొదటి షిప్టులో ఉద్యోగల హాజరు ఇలా..
కొత్తగూడెం కార్పొరేట్లో 1102 మందికి 739 మంది సమ్మెలో పాల్గొన్నారు. కొత్తగూడెం ఏరియాలో 2,036 మందికి 1,755 మంది, ఇల్లెందు ఏరియాలో 562 మందికి 492 మంది, మణుగూరు ఏరియాలో 1,895 మందికి 1,616 మంది, బెల్లంపల్లిలో 857 మందికి 702 మంది, మందమర్రి ఏరియాలో 3,507 మందికి 2,912 మంది, శ్రీరాంపూర్ ఏరియాలో 5,683 మందికి 5,023 మంది, ఆర్జీ-1 ఏరియాలో 3,376 మందికి 2,763 మంది, ఆర్జీ-2 ఏరియాలో 2,525 మందికి 2,150 మంది, ఆర్జీ-3, అడ్రియాలా ఏరియాల్లో 2,640 మందికి 2,004 మంది, భూపాలపల్లి ఏరియాలో 3,319 మందికి 2,821 మంది, సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో 54 మందికి ఆరుగురు సమ్మెలో పాల్గొన్నారు.
రెండో షిప్టులో..
కొత్తగూడెం ఏరియాలో 371 మందికి 292 మంది సమ్మెలో పాల్గొన్నారు. ఇల్లెందు ఏరియాలో 83 మందికి 77 మంది, మణుగూరు ఏరియాలో 373 మందికి 306 మంది, బెల్లంపల్లిలో 146 మందికి 99 మంది, మందమర్రి ఏరియాలో 895 మందికి 723 మంది, శ్రీరాంపూర్ ఏరియాలో 1,846 మందికి 1,593 మంది, ఆర్జీ-1 ఏరియాలో 836 మందికి 658 మంది, ఆర్జీ-2 ఏరియాలో 546 మందికి 415 మంది, ఆర్జీ-3, అడ్రియాలా ఏరియాల్లో 726 మందికి 444 మంది, భూపాలపల్లి ఏరియాలో 1,010 మందికి 837 మంది హాజరయ్యారు.
హెడ్డాఫీస్ ఎదుట వంటావార్పు…
కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద కార్మికులు వంటావార్పు నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో సహపంక్తి భోజనాలు చేశారు. ఉద్యోగులు హెడ్డాఫీస్లోకి ప్రవేశించకుండా కార్యాలయాన్ని ముట్టడి చేశారు.
మణుగూరు ఏరియాలో..
మణుగూరు రూరల్, డిసెంబర్ 11: సింగరేణి మణుగూరు ఏరియాలో మూడోరోజు శనివారమూ సమ్మె కొనసాగింది. దీంతో ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్‌కు బొగ్గు అందలేదు. రైలు, రోడ్డు ద్వారా బొగ్గు రవాణా నిలిచింది. సమ్మెలో టీబీజీకేఎస్ మణుగూరు ఏరియా బ్రాంచి ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావు, లెవన్మెన్ కమిటీ సభ్యుడు సామా శ్రీనివాసరెడ్డి, నాయకులు కోటా శ్రీనివాసరావు, అబ్దుల్ రవూఫ్, వీరభద్రం, వర్మ, అశోక్, పిట్ సెక్రటరీ నాగెల్లి వెంకట్, జేఏసీ నాయకులు రాంగోపాల్, జాన్, వెంకటరత్నం, రవీందర్ పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న నాయకులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫోన్లో సంఘీభావం తెలిపారు. కేంద్రం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలన్నారు. కార్మికులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ‘సింగరేణి బొగ్గు.. తెలంగాణ హక్కు’ అని అన్నారు. బీజేపీ కుటిల యత్నాలను పోరాటంతోనే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమ్మెకు జడ్పీటీసీ పోశం నర్సింహారావు మద్దతు తెలిపారు.