
ముచ్చటగా మూడోసారి వేతనాల పెంపు
ఖమ్మం జిల్లాలో 3,674 మంది,భద్రాద్రి జిల్లాలో 2,060 మందికి లబ్ధి
హర్షం వ్యక్తం చేస్తున్న టీచర్లు, ఆయాలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
భద్రాద్రి కొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న అంగన్వాడీ టీచర్లకు సర్కార్ తీపి కబురు అందించింది. ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వం వారికి కేవలం రూ.4,200 వేతనం ఇవ్వగా స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మూడుసార్లు వేతనాలు పెంచింది. ఇప్పుడు వారి వేతనం రూ.13,650కు చేరుకున్నది. ఆయాల వేతనం రూ.7,800కు చేరింది. ఖమ్మం జిల్లాలో 3,674 మంది, భద్రాద్రి జిల్లాలో 2,060 మందికి లబ్ధిచేకూరన్నది. పెరిగిన వేతనాల ప్రకారం వారి ఖాతాల్లో జమ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం జీవోను సైతం జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఒకప్పుడు 90శాతం నిధులను భరించిన కేంద్రం ఇప్పుడు 60 శాతానికి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భరిస్తున్నది. తాజాగా పెంచిన వేతనాల కారణంగా తెలంగాణ ప్రభుత్వమే 80 శాతం భరించాల్సిన పరిస్థితి. అంగన్వాడీ టీచర్ల సమస్యలపై ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. తాజాగా వేతనాలు పెంచారు.
నాడు వర్కర్లుగా.. నేడు టీచర్లుగా..
గత ప్రభుత్వాల పాలనలో అంగన్వాడీ కేంద్రాలకు సరైన భవనాలు ఉండేవి కాదు. పూరి గుడిసెలు, శిథిలావస్థకు చేరిన ఇండ్లే దిక్కు అయ్యేవి. అన్ని అగచాట్లను భరించి అంగన్వాడీ సిబ్బంది పిల్లలు, గర్భిణులకు సేవలు అందించేవారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల స్వరూపమే మారింది. ఇప్పుడు మౌలిక వసతులు ఉన్న భవనాల్లోనే కేంద్రాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు.. సీఎం కేసీఆర్ అంగన్ వాడీలకు సముచిత గౌరవం కల్పించారు. వర్కర్ల నుంచి వారికి టీచర్ల హోదా ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వమూ తమ సమస్యలను పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం తమను హైదరాబాద్ పిలిపించి మరీ సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..
అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాల పెంపు, సూపర్వైజర్ల పోస్టులకూ సినియారిటీ ప్రాతిపదికన పదోన్నతి కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల సర్వీసు దాటిన ప్రతి అంగన్వాడీ టీచర్ సూపర్వైజర్ పోస్టుకు పరీక్ష రాయవచ్చని నోటిఫికేషన్ సైతం విడుదలైంది. ఈ మేరకు లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో శనివారం అంగన్వాడీ టీచర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మూడోసారి వేతనాలు పెరిగాయి. సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం. ఏ ప్రభుత్వంలోనూ ఇంతగా వేతనాలు పెంచలేదు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు అంగన్వాడీ టీచర్ల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
-పి.పద్మ, అంగన్వాడీ టీచర్, హమాలీ కాలనీ
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
మేం విన్నవించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. వేతనాలు పెరగడం సంతోషాన్నిచ్చింది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మా సమస్యలను పరిష్కరిస్తూనే పిల్లలు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మేం కూడా బాగా పనిచేస్తాం. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకుంటాం.
-నాగమణి, అంగన్వాడీ టీచర్, అంజనాపురం