
అహం వీడి రాజీ పడితేనే సమాజంలో సుఖసంతోషాలు
కక్షిదారులు రాజీ కోసం ఒక అడుగు ముందుకేయాలి
అప్పుడు ప్రతివాదులు రెండు అడుగులు ముందుకొస్తారు
పెండింగ్ కేసుల పరిష్కారానికి అదాలత్ చక్కని వేదిక
జాతీయ లోక్ అదాలత్‌తో జిల్లా జడ్జి చంద్రశేఖర ప్రసాద్
ఖమ్మం లీగల్, డిసెంబర్ 11: సంక్లిష్టమయిన ప్రస్తుత సమాజంలో రాజీమార్గమే మార్గదర్శకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ పేర్కొన్నారు. ఇలాంటి రాజీమార్గంలో నడచిన వారే సమాజానికి మార్గదర్శకులవుతారని, అభినందనీయులవుతారని అన్నారు. ఖమ్మంలోని న్యాయసేవా సదన్‌లో శనివారం ఆయన జాతీయ లోక్ అదాలత్ ప్రక్రియను ప్రారంభించి ప్రసంగించారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో కలతలు పెరిగాయన్నారు. మనిషిలో స్వార్థం ఎక్కువ కావడంతో కేసులు పెరిగాయని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, ప్రస్తుత పెండింగ్ కేసుల సమస్యకు లోక్ అదాలతే పరిష్కార మార్గమని వివరించారు. రాజీ దిశగా కక్షిదారులు ఒక్క అడుగు ప్రయత్నం చేస్తే ప్రతివాదులు రెండు అడుగులు వేసే అవకాశం ఉంటుందని అన్నారు. అందరూ అహం వీడి రాజీ పడితే సమాజం సుఖవంతమవుతుందని అన్నారు. అనంతరం న్యాయసేవా సంస్థ కార్యదర్శి జావీద్‌పాషా మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కోసం మొత్తం 18 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొవిడ్ రక్షణ చర్యల్లో భాగంగా జిల్లా వైద్య అధికారి సౌజన్యంతో కోర్టు ఆవరణలో రెండు మెడికల్ డెస్కులను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా మోటారు వాహన ప్రమాద కేసులు, రుణ వసూళ్ల కేసుల్లో రాజీపడిన కక్షిదారులకు పూలమొక్కలు బహూకరించారు. వారిని సమాజ మార్గదర్శకులుగా అభివర్ణించారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు, న్యాయమూర్తులు కే.అరుణకుమారి, అఫ్రోజ్ అక్తర్, ఆర్,డేనీరూత్, ఎం.శ్యాంశ్రీ, జి.శ్రీనివాస్, ఎన్.శాంతిసోని, పి.మౌనిక, ఎన్.హైమ పూజిత, ఇ.భారతి, జిల్లా కోర్టు పరిపాలనాధికారి ఏ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
14,906 కేసుల పరిష్కారం
ఉమ్మడి ఖమ్మం జిల్లా జాతీయ లోక్ అదాలత్‌లో 14,906 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయసేవా సంస్థ కార్యదర్శి జావీద్‌పాషా ఆయా బెంచ్‌లకు కేసులను కేటాయించారు. మోటారు వాహన ప్రమాద కేసులను అదనపు జిల్లా జడ్జి కే.అరుణకుమారి పర్యవేక్షించారు. మొత్తం 112 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.4.58 కోట్ల పరిహారం ఇప్పించారు. సివిల్, ప్రీ లిటిగేషన్ కేసులను సీనియర్ సివిల్ జడ్జి కే శ్రీనివాస్ పరిష్కరించారు. న్యాయమూర్తులు ఎన్.శాంతిసోని, పీ.మౌనిక, ఎన్‌హెచ్ పూజిత, ఈ.భారతి ఆయా కోర్టుల్లో లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించి 7,756 క్రిమినల్ కేసులను పరిష్కరించారు. ఖమ్మంలో 7,927, కొత్తగూడెంలో 3,320, సత్తుపల్లిలో 1,621, మధిరలో 628, ఇల్లెందులో 855, భద్రాచలంలో 319, మణుగూరులో 236 కేసులు పరిష్కారమయ్యాయి. ఖమ్మంలో న్యాయవాదులు కే గురుమూర్తి, ఎం.ఉమారాణి, వీ రాజేశ్, కే కమలాకర్‌రావు, బీ వసంతరావు, బీ నర్సింహారెడ్డి లోక్ అదాలత్ సభ్యులుగా వ్యవహరించారు.