
ఈవెంట్ ఆర్గనైజర్లకు ఫుల్ డిమాండ్
అంబరాన్నంటుతున్న వివాహ వేడుకలు
పాత సంప్రదాయాలకు హైటెక్ హంగులు
పచ్చని పందిళ్ల స్థానంలో ఫంక్షన్ హాళ్లు
విస్తరిస్తున్న నార్త్ ఇండియన్ కల్చర్
కొత్తగూడెం కల్చరల్, డిసెంబర్ 11 ;పెళ్లంటే.. ‘పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు..’ అన్నాడు మనసు కవి ఆత్రేయ. కానీ కాలం మారిందండోయ్.. మ్యారేజ్ ట్రెండ్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నది.. వధూవరుల తల్లిదండ్రులు ఓల్డ్ కల్చర్‌కు హైటెక్ హంగులు ఇచ్చి అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాది సంగీత్, దాండియాల సంప్రదాయం తెలుగు లోగిళ్లకు తెచ్చారు.. గుర్రపు బగ్గీలు, పల్లకీలో వధూవరుల ఊరేగింపు నయా ట్రెండ్ అయ్యింది.. వివాహ మహోత్సవాన్ని లైవ్‌లో చూసే సాధనాలూ వచ్చేశాయి..ఈ పోకడలపై ‘నమస్తే’ నేటి సండే స్పెషల్.
నాడు పదహారు రోజుల పండుగ.. నేడు రెండు, మూడు రోజులకే కుచించుకుపోయింది… ఒకప్పుడు పెళ్లంటే వాడంతా సందడి కనిపించేది. ఇప్పుడు పక్కింట్లో జరిగేది ఏ కార్యయో తెలియని పరిస్థితి. ఇంటి ముందు పెళ్లి చేసే రోజులు పోయి ఫంక్షన్ హాళ్లే వేదికలవుతున్నాయి… కొబ్బరి మట్టలు, పూల పందిరి స్థానంలో ఇనుప ఫ్రేమ్‌లు, ప్లాస్టిక్ పూల మండపాలొచ్చాయి.. చలువ పందిళ్లను టెంట్లు, పాండాలు ఆక్రమించాయి.. బంతి భోజనాలు పోయి బఫెట్ వచ్చి కొసరి కొసరి వడ్డించే కాలం పోయింది. నార్త్ ఇండియన్ కల్చర్ వచ్చి మన సంప్రదాయాలను పక్కకుతోసింది. సంగీత్, దాండియా, హల్దీ, గుర్రం బగ్గీల సంస్కృతి పెరింది… ప్రీ వెడ్డింగ్ షూట్.. లైవ్ టెలీకాస్ట్లతో మ్యారేజ్ ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారింది..
ఒకప్పుడు ఊరంతా గొప్పగా చెప్పుకునేలా..
ఒకప్పుడు పెళ్లంటే పెద్ద పండుగ. పది రోజుల ముందు నుంచే ఇంటిని అందంగా అలంకరించేవారు. మా బిడ్డ పెండ్లి.. మా ఇంటి ముందటే.. అంగరంగ వైభవంగా జరిపించాలి.. పెండ్లి గురించి ఊరంతా గొప్పగా చెప్పుకోవాలి.. అని వధూవరుల తల్లిదండ్రులు ఆలోచించేవాళ్లు. ఇంటి చుట్టూ పందిళ్లు వేయించి, పచ్చని తోరణాలు, రకరకాల పూలతో అందంగా తీర్చిదిద్దేవారు. చుట్టుపక్కన వారంతా పెళ్లి పనుల్లో తలోచేయి వేసేవారు. వాడలో అంతా పెళ్లి సందడి కనిపించేది. పళ్లైన వారం దాకా ఇంటి ముందు పెళ్లి పందిరి తీసేవారే కాదు. తర్వాత ఓ మంచి రోజు చూసుకొని పందిరి విప్పేవారు. కానిప్పుడు ఇంటి ముందు పెళ్లి చేసే రోజులు పోయాయి. పూర్తిగా ఫంక్షన్ హాళ్లలో పెళ్లి వేదికలవుతున్నాయి. పట్టణాల సంస్కృతి క్రమంగా పల్లెలకు వ్యాపించి, ఒకరోజు వేడుకను ఫంక్షన్ హాల్లోనే కానిచ్చేస్తున్నారు. పెళ్లి ఇంటి ముందు చిన్న టెంట్లు, నాలుగు లైట్లకే పరిమితమవుతున్నారు. కొబ్బరి మట్టలు పెళ్లి పందిరి స్థానంలో ఇనుప ఫ్రేమ్‌లు, ప్లాస్టిక్ పూలతో సినిమా సెట్టింగులను తలపించే మంటపాలొచ్చాయి.
వెడ్డింగ్ ప్లానర్స్‌తో పెళ్లి వేడుక…
పెళ్లి ఆ కుటుంబానికి, పెళ్లి చేసుకునే వ్యక్తికి జీవితకాల మధుర జ్ఞాపకం.. పెళ్లి జరగాలంటే అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. పాత కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. అందరూ కలిసి ఏర్పాట్లు చేసుకునేవారు. ప్రస్తుత కాలంలో చిన్న కుటుంబాలు కావడం, పెళ్లిళ్ల తేదీలు కూడా త్వరగా పెట్టుకుండడంతో ఏర్పాట్లు చేసుకోవడం.. పెళ్లికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడం ఆ కుటుంబానికి ఒక ప్రహసనంగా మారింది. ఈ క్రమంలో ఒత్తిడికి గురవుతూ ఆ పెళ్లికి సంబంధించిన అద్భుత ఘట్టాలను ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉండరు. వచ్చినవారికి మర్యాదలు, డెకరేషన్, పెళ్లికి సంబంధించిన తంతును పూర్తి చేసేందుకు హడావుడి పడాల్సి వస్తుంది. ఈ ఆధునిక కాలంలో పెళ్లి, ఏదైనా శుభకార్యాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకునేలా చేసుకునేందుకు వెడ్డింగ్ ప్లానర్స్ వెలిశారు. వారికి మనం కాంట్రాక్ట్‌కు ఇచ్చామంటే మనమేం చేయాల్సిన పనిలేకుండా అన్ని పనులూ వారే చూసుకుంటారు. మనమే అబ్బురపడేలా పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. ప్రతి చిన్న అంశాన్ని ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తారు. వీటిని మనం వీడియోలో చూసుకున్నా.. ఫొటోలు చూసుకున్నా.. ఈ అందమైన క్షణాలు మళ్లీ మన మదిలో మెదలుతాయి. ఇలా మెహందీ ఫంక్షన్ నుంచి అప్పగింతల వరకు ప్రతి అంశాన్ని కనుల పండువగా తీర్చిదిద్ది ఫలానా వారి పెళ్ల ఎంత బాగా చేశారో అనేలా ఏర్పాట్లు చేస్తారు.
ఇదీతంతు…
పెళ్లి తంతులో ముందుగా వరుడితో గణపతి పూజ చేయిస్తారు. కలశ పూజ చేసి లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువును ఆహ్వానిస్తే వివాహం అయ్యే దాకా ఆయన వధూవరులను ఆశీర్వదిస్తారని నమ్మకం. పట్టుచీర, పూలజడ, బంగారు ఆభరణాలు, బాసికంతో అలంకరించిన వధువును బంధువులు పెళ్లి పీటల మీదికి తీసుకొస్తారు. ముహూర్తం దాకా వధూవరులిద్దరికీ అడ్డుతెర ఉంచుతారు. వధువును లక్ష్మీ స్వరూపంగా, వరుడిని విష్ణు స్వరూపంగా భావించి వధువు తల్లిదండ్రులు కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. వరుడితో ధర్మ, అర్థ, కామమునందు ఈమెను విడిచి జీవనం సాగించను.. అని ప్రమాణం చేయిస్తారు. వధువుతోను ధర్మ.. అర్ధ.. కామములందు.. నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేయిస్తారు. సుముహూర్తంలో వధూవరుల చేత ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. నూరిన జీలకర్ర, బెల్లం ఎలా విడదీయకుండా కలిసిపోతాయో వీరిద్దరూ అలాగే కలిసిపోవాలన్నది దీని భావం. మాంగళ్య దేవతను ఆహ్వానించి గౌరీదేవిని, మంగళ సూత్రాలను పూజించి ముత్తైదువులతో మాంగళ్యాన్ని ఆశీర్వదింపజేసి వరుడితో మాంగళ్యధారణ చేయిస్తారు. తర్వాత ఉత్సాహంగా తలంబ్రాలు పోసుకుంటారు. వధూవరులు మధ్య బిడియాన్ని పోగొట్టేందుకు ఓ పాత్రలో ఉంగరం వేసి తీయమంటారు. వధువుకు మెట్టెలు తొడిగించి, ఆమె చిటికిన వేలు పట్టుకొని ఇద్దరినీ ఏడడుగులు నడిపిస్తారు. ఆ తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తాడు. అంతటితో వివాహ ముఖ్యఘట్టం పూర్తవుతుంది.
నార్త్ ఇండియన్ కల్చర్‌కు ప్రాధాన్యం
శుభకార్యాలు, వివాహ కార్యక్రమాలలో ప్రతి చిన్న అంశం ప్రత్యేకమైనదే. ఆ కార్యక్రమాన్ని మరింత క్రియేటివిటీతో తీర్చిదిద్ది మనమే అబ్బురపరిచేలా చేస్తుంటారు ఈవెంట్ నిర్వాహకులు. వివాహ వేడుకల్లో నార్త్ ఇండియన్ కల్చర్ చొచ్చుకొచ్చింది. మెహందీ ఫంక్షన్, మంగళ స్నానాలు, పెళ్లి కూతురు మేకప్ వంటి వాటికి అద్భుత ఏర్పాట్లు చేస్తారు. అలాగే పెళ్లికి కావాల్సిన సామగ్రిని తూచా తప్పకుండా ఉండేలా హిందూ సంప్రదాయంలో జరిగే వివాహ వేడుకలను ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూసుకుంటారు. ముత్యాల తలంబ్రాలు, సప్తపది, గంగ్రోతి స్నానం, పల్లకీ, పెళ్లికూతురును మేనమామలు తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసే బుట్ట, సానరాయి, కొబ్బరి కుడకలు, ఉంగరాల బిందె, చెంబు తాంబూలం, గరికెముంత, నాగవల్లి కుండలు, అడ్డుతెర, పెళ్లి కొడుకు వడుగు సమయంలో కావాల్సిన సామగ్రి, అలాగే కాశీకి వెళ్లినప్పుడు కావాల్సిన చెప్పులు, గొడుగు వంటివి ఇలా ప్రతి ఒక్కటీ వారు అందుబాటులో ఉంచుతారు.
నయా ట్రెండ్‌పై భిన్నాభిప్రాయాలు
పెళ్లి తంతులో వస్తున్న మార్పులను కొంత మంది ఆహ్వానిస్తున్నా.. సంప్రదాయాలకు విలువిచ్చేవారు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మనుషులు ఏకమై జీవితాంతం కలిసి ఉండేం దుకు మూలమయ్యే పెళ్లికి ఆధునికతను జోడించినా మన సంస్కృతి సంప్రదా యాలకు పెద్దపీట వేయాలని కోరు తున్నారు. పాశ్చాత్య పోకడ లేకుండా పెళ్లి గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని, లేకుంటే కను మరుగయ్యే ఆచారాల్లో పెళ్లి కూడా ఒకటవుతుందని నొక్కి చెప్తున్నారు.