
మామిళ్లగూడెం, అక్టోబర్ 11: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అనుబంధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు జరగనున్నాయన్నారు. ఈ పరీక్షలకు 76 కేంద్రాల్లో 17,738 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కొవిడ్ కేసులుంటే ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు హాజరవుతున్న సిబ్బందిని డీఈవో సమన్వయంతో ముందస్తుగానే కేటాయించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, ఏడీసీపీ సుభాశ్‌చంద్రబోస్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో అప్పారావు, డీఐఈవో రవికుమార్, డీఈవో యాదయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, విద్యుత్ డీఈ రామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్పెషల్ డ్రైవ్ ముమ్మరం చేయాలి
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ముమ్మరం చేయాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో భాగంగా కొవిడ్ వ్యాక్సిన్ తీరుపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 150 గ్రామ పంచాయతీల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నామన్నారు. భవిష్యత్తులో కొవిడ్ నుంచి ప్రజలను రక్షించుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, దీనిపై ప్రజల్లో మరింత చైతన్యం కల్పించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలను వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న జిల్లాగా నిలపాలని ఆదేశించారు.
సంబురాలకు ఏర్పాట్లు చేయాలి
బతుకమ్మ సందర్భంగా ఖమ్మం పటేల్ స్టేడియంలో మంగళవారం జరుగనున్న సంబురాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. బతుకమ్మల నిమజ్జనం రోజున మున్నేరు కాలువ ఒడ్డు, ప్రకాశ్‌నగర్ ప్రాంతాల్లో మహిళలు బతుకమ్మలు ఆడుకుని నిమజ్జనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.