
పరీక్షా కేంద్రాల్లో జామర్స్
మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్ష
ప్రతి కేంద్రానికి ఇద్దరు సీబీఎస్ఈ అబ్జర్వర్లు
9 కేంద్రాలు, 3,420 మంది అభ్యర్థులు
ఖమ్మం ఎడ్యుకేషన్,సెప్టెంబర్ 11 : మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ కేంద్రాల్లో అధికారులు పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయస్థాయిలో పరీక్ష జరగనుండడంతో ఆటంకాలు కలగకుండా పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రాల్లో తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. పరీక్షలకు 3,420 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ప్రవేశ పరీక్ష మూడు గంటలపాటు జరగనున్నది. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్లతోపాటు దరఖాస్తు తీసుకుని కేంద్రాలకు చేరుకోవాలన్నారు. 720 మార్కులకు నిర్వహించే పరీక్షను బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 45 చొప్పున ప్రశ్నలు ఉండనున్నాయి. నీట్ పరీక్షలో ప్రతి సబ్జెక్ట్‌లో సెక్షన్ ‘ఏ’లో 35 ప్రశ్నలు ఉంటాయి. అన్నీ రాయాలి. సెక్షన్ ‘బీ’లో 15 ఇస్తారు. ఏవైనా 10 రాయాలి. ఒక్కోప్రశ్నకు నాలుగు మార్కులు ఉండనున్నాయి. సమాధానం తప్పు అయితే నెగిటివ్ మార్కులున్నాయి. ఇప్పటికే పరీక్ష కేంద్రాలను పోలీస్‌లు తమ ఆధీనంలో తీసుకున్నారు.
ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతి..
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరగనున్నది. ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పాస్‌పోర్ట్ ఫొటోను అడ్మిట్‌కు జత చేయాలి. మరో ఫొటోను తమ వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
ఇన్విజిలేటర్లతో సమావేశం…
నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో శనివారం ఇన్విజిలేటర్లతో సమావేశం నిర్వహించారు. పరీక్ష గదిలో ప్రతి విద్యార్థిపై నిశితంగా పరిశీలించాల్సిన అంశాలు, విద్యార్థుల ఆధారాలు నమోదు చేసేటప్పుడు, ఓఎంఆర్ పూర్తి చేసే సమయంలో ఇవ్వాల్సిన సూచనలపై అవగాహన కల్పించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రతినిధులు, కోఆర్డినేటర్ రామసహాయం పార్వతిరెడ్డి పలు సూచనలు చేశారు. కేంద్రానికి ఏ సమయంలో చేరుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే తెలియజేయాలని స్పష్టం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రతినిధులు నగరంలోని తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి కేంద్రంలో జామర్స్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రం చుట్టు పక్కల ప్రాంతాల్లో మొబైల్ఫోన్లకు సిగ్నల్ అందకుండా జామర్స్ పని చేస్తాయి.
ఖమ్మంలోని పరీక్షా కేంద్రాలు..
హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ (సెంటర్-1, సెంటర్-2) మమత రోడ్, ఖమ్మం
శ్రీచైతన్య ఇంటర్నేషనల్ స్కూల్, మమత రోడ్ ఖమ్మం.
బ్లూమింగ్ మైండ్స్ స్కూల్, బల్లేపల్లి, ఖమ్మం
వీవీసీ పబ్లిక్ స్కూల్, రఘునాథపాలెం
ఎస్వీఎం పబ్లిక్ స్కూల్, శ్రీనివాసనగర్, ఖమ్మం
కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాల, ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం
మ్యాక్స్ ఫార్మసీ కాలేజీ, ఖమ్మం
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గాంధీచౌక్, ఖమ్మం