
కొలువుదీరిన గణనాథులు…
ఊరూరా భక్తుల కోలాహలం
భక్తిశ్రద్ధలతో పూజలందుకుంటున్న గణేషుడు
రెండేళ్ల తర్వాత నవరాత్రి ఉత్సవాలు షురూ
ఖమ్మం/ ఖమ్మం కల్చరల్/ రఘునాథపాలెం, సెప్టెంబర్ 11 ‘గణేశ్ మహారాజ్‌కీ జై.. వరములివ్వు బొజ్జ గణేశా.. పార్వతి తనయా నమో నమః’ అంటూ భక్తులు గణనాథుణ్ని కీర్తిస్తూ, ఉత్సవ మండపాల్లో ప్రతిష్టించి పూజలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భాద్రపద శుద్ధ చవితి శుక్రవారం వినాయక చవితి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వందలాది చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్‌లు, మండపాల్లో వినాయక విగ్రహాలను శాస్ర్తోక్తంగా ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.
రెండేళ్ల తర్వాత పూర్వ వైభవంగా..
కరోనా కారణంగా రెండేళ్లపాటు సామూహికంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోలేదు. ఈ ఏడాది కొంత ఉపశమనం కలగడంతో కొవిడ్ నిబంధనలతో మళ్లీ వైభవంగా మొదలయ్యాయి.
దేదీప్యంగా శివ గణపతి మట్టి విగ్రహం..
బ్రాహ్మణ బజార్ శివాలయం సెంటర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 18 అడుగుల భారీ శివ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మట్టితో తయారు చేసిన శివ గణపతి విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందాడు. రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టి విగ్రహంగా దానిని ఇక్కడ నెలకొల్పడం విశేషం. కేవలం 7 నిమిషాల్లోనే ఈ విగ్రహం నీటిలో కరిగిపోతుందని నిర్వాహకులు సాయికిరణ్, రాకేశ్ చెప్పారు. హైదరాబాద్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వసంతలక్ష్మి దంపతులు, కూసుమంచి వినాయక ఉత్సవ మండపంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పూజలు చేశారు.
గణపతి పూజల్లో మేయర్, సుడా చైర్మన్
వినాయక చవితి సందర్భంగా ఖమ్మంలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల్లో నిర్వహించిన పూజల్లో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పలు చోట్ల మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్లు రాపర్తి శరత్, చామకూరి వెంకటనారాయణ, నాయుకులు వల్లభనేని రామారావు, సైదారావు, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, బొమ్మ నాగేశ్వరరావు, బొమ్మ సత్యం, కౌషిక్, రామకృష్ణ తదిరులు పాల్గొన్నారు.
కొలువుదీరిన గణనాథులు
ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో శుక్రవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆది దేవుడైన వినాయకుడిని భక్తులు తమ ఇళ్లల్లో, ప్రత్యేక మండపాల్లో ప్రతిష్ఠించి ఉండ్రాళ్లు, పాయసం తదితర వంటకాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఖమ్మం అర్బన్‌లో 300కు పైగా వినాయక విగ్రహాలు కొలువుదీరాయి.