
కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలి
పల్లెప్రగతి నిరంతరం కార్యక్రమం
పారిశుధ్యంపై రాజీపడొద్దు
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అదనపు కలెక్టర్, సీఈవో, డీపీవో, ఆర్డీవో, పీఆర్ అధికారులతో పల్లె ప్రగతి కార్యక్రమాలు, కరోనా నియంత్రణ చర్యలు, పల్లె, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పారిశుధ్య కార్యక్రమాలు, వ్యర్థాల సేకరణ, నర్సరీలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాధి నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని, వ్యాక్సిన్లు అందరికీ అందాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అందరిలోనూ అప్రమత్తత అవసరమని, గ్రామాలను పరిశుభ్రంగా అద్దం లెక్క తీర్చిదిద్దాలన్నారు. పల్లె ప్రగతి నిరంతర కార్యక్రమమని, పారిశుధ్యంపై రాజీవద్దని, ప్రతిరోజు ఉదయం 7గంటల కల్లా కార్యదర్శులు విధుల్లో ఉండాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేయాలని, ఉన్నతాధికారులంతా క్షేత్ర పర్యటనలు చేసి, పనులను పర్యవేక్షించాలని చెప్పారు. సమావేశంలో డీఆర్డీవో మధుసూదన్‌రాజు, సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత్, పీఆర్ ఈఈ సుధాకర్ పాల్గొన్నారు.