
కేసీఆర్ సర్కారు చారిత్రక నిర్ణయం
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
విలేజ్ హాస్పిటల్స్‌గా మారనున్న సబ్‌సెంటర్లు
ఉమ్మడి జిల్లాకు 221 ఆస్పత్రుల కేటాయింపు
వైద్యుల నియామకానికి నోటిఫికేషన్
కొత్తగూడెం/ ఖమ్మం సిటీ, అక్టోబర్ 10: ‘‘ఆరోగ్య తెలంగాణ’ సాధించేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్ధులై పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.. ఇప్పటికే జిల్లాకో డయాగ్నస్టిక్ హబ్ కేటాయించిన ఆయన తాజాగా పల్లె పల్లెనా దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ పరిధిలోని జిల్లాల్లోని సబ్సెంటర్లను ‘పల్లె దవాఖానలు’గా మార్చాలని ఉత్తర్వులు జారీ చేశారు..దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 221 ‘విలేజ్ హాస్పిటల్స్’ ఏర్పాటు కానున్నాయి.. ఆయా ఆస్పత్రుల్లో ఇక నుంచి ఎంబీబీఎస్ వైద్యులు వైద్య సేవలు అందించనున్నారు.. రెండు జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్ నేతృత్వంలో వైద్యుల నియామకం జరుగుతున్నది..
ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు.. ఈ నానుడికి కార్యరూపం చూపింది తెలంగాణ సర్కార్. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సంకల్పించారు. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాకో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేశారు. ఒకే చోట 57 రకాల వైద్యపరీక్షలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నయాపైసా ఖర్చులేకుండా కొవిడ్ ప్రొఫైల్‌తో పాటు ఖరీదైన వైద్యాన్ని బడుగులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని అన్ని సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చాలని నిర్ణయించారు. ఇక్కడ 24 గంటలు ప్రజలకు వైద్యసేవలు అందేలా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేంద్రాల వద్ద సిబ్బంది రక్త నమూనాలు సేకరించి జిల్లా డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు కానున్నాయి.
ఖమ్మం జిల్లాలోని పంచాయతీల్లో..
పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సబ్‌సెంటర్స్ స్థానంలో పల్లె దవాఖానలు ఏర్పాటు చేయనున్నది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాకు 89 ఆస్పత్రులు మంజూరయ్యాయి. ముదిగొండ మండలం బోదులబండ పీహెచ్సీ పరిధిలో ఐదు, బోనకల్ పీహెచ్సీ పరిధిలో ఎనిమిది, చెన్నూరు పీహెచ్సీ పరిధిలో ఐదు, చింతకాని పీహెచ్సీ పరిధిలో తొమ్మిది, ఏన్కూరు పీహెచ్సీ పరిధిలో పది, కల్లూరు పీహెచ్సీ పరిధిలో ఐదు, కామేపల్లి పీహెచ్సీ పరిధిలో ఐదు, మంచుకొండ పీహెచ్సీ పరిధిలో తొమ్మిది, సింగరేణి పీహెచ్సీ పరిధిలో నాలుగు, తల్లాడ పీహెచ్సీ పరిధిలో తొమ్మిది, వేంసూరు పీహెచ్సీ పరిధిలో ఎనిమిది, వైరా పీహెచ్సీ పరిధిలో తొమ్మిది పల్లె దవాఖానల కేటాయింపు జరిగింది. జిల్లాలోని 89 పల్లె దవాఖానల్లో వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు కసరత్తు షురూ అయింది. ఇటీవల వైద్యుల పోస్టులకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్ మాలతి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలాంటి పైరవీలకు తావులేకుండా మెరిట్, రిజర్వేషన్ ఆఫ్ రోస్టర్ పద్ధతిన కలెక్టర్ వీపీ గౌతమ్ చైర్మన్‌గా సెలక్షన్ కమిటీ నియామకాలు చేపట్టనున్నది. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా ఈనెల 26న వైద్యులకు పోస్టింగ్‌లు రానున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ‘పల్లె దవాఖానల’ నిర్ణయంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
ఏజెన్సీ జిల్లా భద్రాద్రి జిల్లా మొత్తం 240 సబ్ సెంటర్లు ఉండగా వీటిలో 132 సెంటర్లు పల్లె దవాఖానలుగా మారనున్నాయి. వీటిలో వైద్యం అందించేందుకు 132 వైద్యులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. కలెక్టర్ అనుదీప్ నేతృత్వంలో నిమామక కమిటీ వైద్యులను నియమించనున్నది. మిగిలిన సెబ్సెంటర్లు కూడా మున్ముందు పల్లె దవాఖానలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు, రెండు యూఎఫ్డబ్ల్యూఎస్ కేంద్రాలు, నాలుగు ఏరియా ఆస్పత్రులు, ఒక జిల్లా డయాగ్నస్టిక్ కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. గతంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో మాత్రమే వైద్య సేవలు అందేవి. ఇప్పుడు పల్లె దవాఖానల్లో ఎంబీబీఎస్ చదివిన వైద్యులు వైద్య సేవలు అందించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక జీవో జారీ చేసింది.
సిబ్బంది నియామకానికి చర్యలు..
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్స్ పరిధిలో ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రజలు వైద్యం పొందడానికి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న ది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయంతో పల్లె పల్లెనా దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దవాఖానల్లో పని చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిన నెలకు రూ.40 వేల వేతనంతో వైద్యుల నియామకం జరుగనున్నది.
వైద్యులను భర్తీ చేస్తాం..
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. జిల్లాలోని అన్ని సబ్‌సెంటర్లు పల్లె దవాఖానలుగా మారనున్నాయి. మున్ముందు 24 గంటలు ప్రజలకు వైద్య సేవలు అందుతాయి. ఆయా దవాఖానల్లో వైద్యుల భర్తీ చేస్తున్నాం. త్వరలో వైద్యులు సేవలు అందిస్తారు.