
గొలుసుకట్టు చెరువులతో పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం
పచ్చని పైర్లతో కళకళలాడుతున్న ఉమ్మడి జిల్లా
ఆయకట్టులో భారీగా పెరిగిన పంటల సాగు
ఇల్లెందు, ఆగస్టు 10;నాడు దూరదృష్టితో కాకతీయులు గొలుసుకట్టు చెరువులకు పునాది వేశారు. అవి ఇప్పటికీ రైతులకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో మరమ్మతులకు గురికాగా.. తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’తో పూర్వవైభవంలోకి తీసుకొచ్చింది. దీంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం కలిగింది. గతంలో పడావుపడిన భూములు నేడు పచ్చనిపైర్లతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీడు భూములు సస్యశ్యామలంగా మారాయి. పంట విస్తీర్ణం పెరగడంతో సాగుకు మహర్దశ వచ్చింది.
సాగునీటి వనరులు లేని ఏజెన్సీలో కాకతీయులు ముందు జాగ్రత్తగా చెరువులను తవ్వించారు. వందలాది ఏళ్ల క్రితమే పల్లె సీమలను సుసంపన్నం చేయడానికి ఈ గొలుసుకట్టు చెరువులకు బీజం వేశారు. రామప్ప, లక్నవరం, పాకాల, బయ్యారం చెరువులే ఇందుకు ఉదాహరణ. వాటికింద అనేక గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఇవి అలుగు పడితే కృష్ణా బేసిన్లో పడే విధంగా రూపొందించారు. అటు గోదావరి ఇవతల ఒడ్డున పడిన ప్రతి చినుకునూ ఒడిసి పట్టుకునే విధంగా చెరువులున్నాయి. ఫలితంగా ఏజెన్సీలోని పోడు భూములు, బీడు భూములు, మైదానంలోని నీరందని భూములు తడిసిముద్దయ్యే విధంగా నిర్మాణాలు చేపట్టారు. ఒక్కొక్క చెరువుకు గొలుసు రూపంలో అనేక లింకుల ద్వారా చెరువుల నిర్మాణం చేపట్టారు. చెరువులు, కుంటలకు అనుసంధానంగా అనేక ఫీడర్ చానళ్లను ఏర్పాటు చేశారు. ఒక చెరువు అలుగుపారిందంటే వాటికింద ఉన్న చెరువులన్నీ నిండి అవి కూడా అలుగుపోసే విధంగా రూపకల్పన చేశారు.
చెరువులు, కుంటలు జలకళ
ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఇల్లెందు ఏజెన్సీలోని రోళ్లపాడు, లలితాపురం చెరువుల నుంచి దిగువకు నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. గాదెపాడు, కామేపల్లి, వైరా రిజర్వాయర్ వరకు సుమారు వంద కిలోమీటర్ల మేర నీటి ప్రవాహం కొనసాగుతోంది. రోళ్లపాడు కింద 26 చెరువులు, సింగభూపాలెం కింద 30 చెరువులు, లంకాసాగర్ కింద 8 చెరువులు, పెద్దవాగు కింద 12 చెరువులు పరవళ్లు తొక్కుతున్నాయి. మొత్తంగా ఒక చెరువు నిండితే సగటున 30 వేల ఎకరాల వరకు సాగవుతుందని జలవనరుల శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
నీటిబొట్టును ఒడిసిపట్టి..
ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టేందుకు సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. వందల ఏళ్ల క్రితం కాకతీయులు తవ్వించిన చెరువులు చాలా వరకూ పూడిపోగా వాటిల్లో పూడిక తీయించిన నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 208 చెరువులు, 1154 కుంటలు ఉన్నాయి. వీటికింద మొత్తం 51.79 శాతం భూమి సాగవుతోంది.
ఫీడర్ ఛానళ్లదే భవిష్యత్తు..ఒకప్పుడు కబ్జాకు గురైన ఫీడర్ ఛానళ్లు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఉదాహరణకు కామేపల్లి మండలంలో నిమ్మవాగు కామేపల్లి చెరువు నుంచి ప్రారంభమైన చానల్ ప్రధాన ఫీడర్గా వైరా రిజర్వాయర్ వరకు కొనసాగుతుంది. గొలుసుకట్టు చెరువులు నిండాలంటే భవిష్యత్తులో ఫీడర్ ఛానళ్లే ఆధారం కావాల్సి ఉంటుంది.