
సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి
కారేపల్లి మండల పర్యటనలో ఖమ్మం కలెక్టర్ గౌతమ్
కారేపల్లి రూరల్, ఆగస్టు 10: గ్రామాల్లో పారిశుధ్యంపై సర్పంచులు, కార్యదర్శులు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ సూచించారు. కారేపల్లి మండలంలోని మాధారం, పేరుపల్లి గ్రామ పంచాయతీల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. గ్రామస్తులను చైతన్యవంతులను చేస్తూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సహకరించని వారిపై చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యం లోపిస్తే ఇంటి యజమానులకు కూడా జరిమానాలు విధించాలని ఆదేశించారు.
మాధారం గ్రామంలో పర్యటన
మాధారంలో అన్ని వీధుల్లోనూ కలెక్టర్ పర్యటించారు. కరోనా కేసుల గురించి ప్రశ్నించారు. 8 పాజిటివ్ కేసులు ఉన్నాయని స్థానిక వైద్య సిబ్బంది తెలుపగా వెంటనే ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిలో ఎంతమందికి ఫైన్ వేశారని ప్రశ్నించారు. అదే సమయంలో పంచాయతీ పారిశుధ్య కార్మికుడు మాస్కు లేకుండా కనిపించడంతో అతడికి ఫైన్ విధించాలని కార్యదర్శిని ఆదేశించారు. దీంతో కార్యదర్శి అతడికి రూ.1000 ఫైన్ విధించారు. ఎస్కే బందెల్లికి చెందిన ఇంటి ఆవరణలో పాత టైర్లు ఉండడంతో కలెక్టర్ వాటిని పరిశీలించారు. ఆ టైర్లలో నిల్వ ఉన్న నీటిలో లార్వాను గమనించారు. ఇంటి యజమానికి రూ.1000 జరిమానా విధించాలని ఆదేశించారు. గ్రామంలో ఓ కొవిడ్ పేషెంట్ ఇంటికి వెళ్లారు. వైద్య సిబ్బంది ఇంటికి వచ్చి మందులు ఇస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. కొంత ఆయాసంగా ఉందని ఆ రోగి చెప్పడంతో పీహెచ్సీలో ఉన్న ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ను వెంటనే ఏర్పాటు చేయించాలని డాక్టర్ను ఆదేశించారు. డీఎంహెచ్వో మాలతి, సంధ్య, డీఎల్పీవో పుల్లారావు, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీవో రమాదేవి, మాధారం సర్పంచ్ అజ్మీరా నరేశ్ పాల్గొన్నారు.