
అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
లక్ష్మీనగరం ఎస్బీఐ చోరీ కేసు ఛేదన
వివరాలు వెల్లడించిన భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్
దుమ్ముగూడెం, జనవరి 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరం ఎస్బీఐలో గత నెల 14న చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మీనగరం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్ వివరాలు వెల్లడించారు. గత నెలలో లక్ష్మీనగరం ఎస్బీఐ బ్యాంకు వెనుక నుంచి కొందరు బ్యాంకులోకి చొరబడ్డారు. గ్యాస్ కట్టర్‌తో సేఫ్ లాకర్‌ను తెరిచారు. రూ.19,35,650ను అపహరించారు. సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్‌ను తమ వెంట తీసుకెళ్లారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు విచారణ ప్రారంభించారు. లక్ష్మీనగరంలోని సీసీ కెమెరాలు, భద్రాచలంలోని సీసీ కెమెరాల ఆధారంగా ఓ కారును గుర్తించారు. ఇదే కారులో ప్రయాణించిన దుండగులు చోరీకి పాల్పడినట్లు భావించారు. ఎస్పీ సునీల్‌దత్ ఆదేశాల మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వాహనం కోసం గాలించారు. వాహనం ఏపీలోని చింతూరు మీదుగా భద్రాచలం వైపు వస్తున్నట్లు పక్కా సమాచారంతో కాపుగాశారు. భద్రాచలంలోని కూనవరం రోడ్డులో సీఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐ పుల్లయ్య, ఎస్సై రవికుమార్, పోలీస్ సిబ్బంది ఆ వాహనాన్ని ఆపారు. అందలో నుంచి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో లభించిన రెండు గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన నవాబుల్ హసన్, మహమూద్ నవాబ్ హసన్ ఖాన్, రాజు వసంతరావు వర్బే, సాదిక్ అలీఖాన్, మహమూద్ మహకుమ్, యూసఫ్ ఖాన్, ఇంతిఖాబ్ ఖాన్‌గా గుర్తించారు. వారి నుంచి రూ.3.10 లక్షల నగదు, కారు, తొమ్మిది సెల్ఫోన్లు, చోరీకి ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐ పుల్లయ్య, ఎస్సై రవికుమార్, ఏఎస్సై సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుళ్లు సురేశ్, శంకర్, ఐటీ కోర్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.
నిందితులపై గతంలోనూ కేసులు..
పట్టుబడిన నిందితులు మూడేళ్ల నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు బ్యాంకులు, ఏటీఎంలలో చోరీకి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు ఎస్బీఐలోనూ చోరీ చేశారు. ఇదే కేసులో పోలీసులకు పట్టుబడి శిక్ష అనుభవించి విడుదలయ్యారు. గత నెల 5న ఆసిఫాబాద్ జిల్లాలోని అడ గ్రామం ఎస్బీఐలో రూ.8 లక్షలు చోరీ చేశారు.