
తొలి విడతలో సీనియర్ సిటిజన్స్,ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు..
ఖమ్మంలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించినమంత్రి అజయ్
భద్రాద్రి కొత్తగూడెంలోతొలిరోజు 3,923 మందికి టీకాలు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 10 (నమస్తే తెలంగాణ)/ అశ్వారావుపేట:రూపాలు మార్చుకుంటున్న కొవిడ్ వైరస్ మూడో దశలో విస్తరిస్తూ పరేషాన్ చేస్తోంది. కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరేంత తీవ్రత ఉండడంలేదు. అయినప్పటికీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ నెల 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ నెల 20 వరకు కరోనా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మరోవైపు టీనేజర్లకు ముమ్మరంగా టీకాలు అందిస్తోంది. ఇంకోవైపు బూస్టర్ డోస్‌ను కూడా సోమవారం నుంచి మొదలు పెట్టింది. భద్రాద్రి జిల్లాలో మూడో దశలో కొవిడ్ యాక్టివ్ కేసులు 89గా ఉన్నాయి. ఇందులో ఐదుగురు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి.
20 వరకూ ఆంక్షలు..
వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నెల 20 వరకు కొవిడ్ నిబంధనల్లో భాగంగా సభలు, సమావేశాలపై నిషేధం విధించింది. ప్రభుత్వ అధికారులు కూడా సమావేశాలు వాయిదా వేసుకున్నారు. కేవలం ఆన్లైన్లో మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని, అవసరమైతే కేసు నమోదు చేస్తామని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లాలో 50 కేంద్రాల ద్వారా 20 వేల మంది టీనేజర్లు, విద్యార్థులకు టీకాలు వేశారు. జిల్లాలో 18 ఏళ్లలోపు వయసున్న వారు 55 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలనూ అంతరంగికంగానే నిర్వహించనున్నారు. ఆసుపత్రుల్లో టెస్టింగ్ మెటీరియను, మందులను అందుబాటులో ఉంచారు. అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్టును కూడా చేసేందుకు జిల్లా కేంద్రంలో రోజుకు 250 చొప్పున కిట్లను అందుబాటులో ఉంచారు.
సంసిద్ధంగా ఆసుపత్రులు..
కేసుల సంఖ్య పెరిగినా సేవలందించేందుకు వైద్య శాఖ సిద్ధంగా ఉంది. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట ఆసుపత్రుల్లో వెయ్యి ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచింది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ మరో 500 బెడ్లను ఏర్పాటు చేసింది. భద్రాచలం, కొత్తగూడెంలలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సైతం సిద్ధం చేసింది. ప్రతి పీహెచ్‌సీలోనూ రెండు ఆక్సిజన్ సిలిండర్లు, ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను అందుబాటులో ఉంచారు. పది వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉన్నాయి.
బూస్టర్ కు 1.05 లక్షల మంది..
భద్రాద్రి జిల్లాలో 40 కేంద్రాల ద్వారా ప్రికాషన్ (ముందస్తు) టీకాలు వేయనున్నారు. జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ముందుగా హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏండ్లు దాటిన వారికి టీకా వేస్తున్నారు. ఇందులో హెల్త్ కేర్ వర్కర్లు 8000 మంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 9000 మంది, 60 ఏళ్లు దాటిన వారు 90,000 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికి టీకా వేస్తున్నారు. మొత్తం 1,05,000 మంది ఉన్నారు. రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తయిన వారు మాత్రమే ప్రికాషన్ డోస్ తీసుకోవాలని ముందస్తు సమాచారం ఇచ్చారు. జిల్లాలో ఈ ప్రక్రియ కొనసాగుతున్నది.
ఆంక్షలు కొనసాగుతాయి..
వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ నెల 20 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. సభలు, సమావేశాలకు అనుమతి లేదు. ముక్కోటి ఉత్సవాలను కూడా అర్చకులు గుడిలోనే నిర్వహిస్తారు. భక్తులు టీవీల ద్వారా వీక్షించాలి. టీనేజర్ల వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. వారిలో మొదటి డోస్ కూడా వంద శాతం పూర్తయింది. సెకండ్ డోస్ కొనసాగుతోంది. సోమవారం నుంచి బూస్టర్ డోస్‌ను మొదలుపెట్టాం. రద్దీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ శానిటైజర్ వినియోగించాలి. తప్పకుండా మాస్క్ ధరించాలి.
-అనుదీప్, కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం
కొవిడ్ నిబంధనలు పాటించాలి..
కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కనీస జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలు ఈ నెల 20 వరకు అమల్లో ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. మాస్క్ లేకుంటే రూ.1,000 జరిమానా విధిస్తాం. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలి.
-బంధం ఉపేందర్, సీఐ, అశ్వారావుపేట