దమ్మపేట, అక్టోబర్ 3 : స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దడ పుడుతున్నదని, పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే భయం పట్టుకున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వద్ద డబ్బులు ఉంటే.. బీఆర్ఎస్ వెంట జనం ఉన్నారని, వారే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డ రమేశ్ ఆధ్వర్యంలో పార్కలగండిలోని కొబ్బరితోటలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు పంచడమే పనిగా పెట్టుకున్నదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడుగుతారని, వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీల సంగతి ఏమైందని వారు ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం ఖాయమన్నారు.
యూరియా కోసం రైతులు సొసైటీల చుట్టూ తిరుగుతున్నా, పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో మంజూరు చేయకపోవడంతోపాటు అనర్హులకు ఇండ్లు మంజూరు చేసి పేదలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. అనంతరం పట్వారిగూడెం పంచాయతీకి చెందిన బుల్లా నాగరాజు, వాడే వసంత్, కొమరం వెంకటేశ్వరరావు, కుర్సం మారప్ప, కాసిని బాలాజీ, బందెల నాగరాజు, గణేష్‌పాడు నుంచి ఎర్రగొర్ల సాయి, దురదపాడు నుంచి కుర్పం కవి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, మాజీ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, మాజీ ఉపసర్పంచ్ దారా యుగంధర్, నాయకులు అంకత ఉమామహేశ్వరరావు, రాజుబోయిన ఏసుబాబు, యర్లగడ్డ శ్రీను, శ్రీరాములు సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ దేవరపల్లి అజయ్‌కుమార్, సోయం వీరభద్రం, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎస్కే.బుడే, శ్రీరాముల చంద్రారావు, పాకనాడు శ్రీను, తాళ్ల వెంకటేశ్వర్లు, అబ్దుల్ జిన్నా, కోర్స్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.