జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 26 : జనగామ జిల్లా కేంద్రంలో 10 నెలల పాప కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్బన్ సీఐ దామోదర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 163కి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న పీఎల్జీ కన్వెన్షన్‌లో కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి చెందిన రామ్ జూల్ రజాక్ తన భార్యతో కలిసి కూలీ పనిచేసుకుంటూ అక్కడే గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి గుడిసె పక్కనే ఖమ్మం జిల్లాకు చెందిన సురేశ్, ప్రేమలత దంపతులు కూడా అక్కడే కూలీ పనిచేసుకుంటూ గుడిసె వేసుకొని ఉంటున్నారు.
ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడి, వారి పిల్లలను ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు బజారుకు తీసుకెళ్లేంత చనువు ఏర్పడింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సురేశ్, ప్రేమలత దంపతులు బజారుకు వెళ్లి వస్తామని చెప్పి రామ్ జూల్ రజాక్ చిన్న కూతురు శివాని(10 నెలలు)ని బైక్‌పై తీసుకొని వెళ్లి తిరిగి రాలేదు. వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తున్నది. రాత్రి అయినా రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజేశ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ తెలిసిన వారు జనగామ అర్బన్ సీఐ సెల్ నంబర్ 8712685202, ఎస్సై-1 సెల్ నంబర్ 8712685259, ఎస్సై-2 సెల్ నంబర్ 8712685260కు సమాచారం అందించాలని సీఐ కోరారు.