
ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అంతా సిద్ధం
6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
సత్తుపల్లిలో ఇప్పటికే ప్రారంభమైన కొనుగోళ్లు
ఇతర రాష్ట్రం నుంచి గింజ వచ్చినా కఠిన చర్యలు
రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు
ఖమ్మం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి)/ కొత్తగూడెం: ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కర్షకులు తక్కువ ధరకు దళారులకు విక్రయించకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. రైతులకు మద్దతు ధర అందించేలా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా వానకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే, ఈ సారి వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం ప్రభుత్వం విముఖత చూపింది. దీంతో రైతుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ సారి ఖమ్మం జిల్లాలో 179 కొనుగోలు కేంద్రాల ద్వారా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 154 కేంద్రాల ద్వారా 2.50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు ఆరుగాలం శ్రమించి పండించిన వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ వేగవంతమైంది. రైతులు దళారులకు తక్కువ ధరకు విక్రయించుకునే అవకాశం లేకుండా అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు కొండంత అండనిస్తున్నాయి. ఈ సారి వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం విముఖత చూపినా రైతుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఉమ్మడి జిల్లాలో వరి కోతలు ప్రారంభం కావడంతో ఆయా జిల్లా అధికారులు అందుకు తగ్గట్టుగా దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఖమ్మం జిల్లాలో 179 కేంద్రాలు..
ఖమ్మం జిల్లాలో 179 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వానకాలం పంట తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అదనపు కలెక్టర్ మధుసూదన్ కలిసి ఆదివారం ప్రారంభించారు. నవంబర్ మొదటివారంలో ప్రారంభమైన కొనుగోళ్లు జనవరి చివరి వరకూ కొనసాగనున్నాయి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటుకానున్నాయి. ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రిలో 154 కేంద్రాలు..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 154 కేంద్రాల ద్వారా 2.50 లక్షల టన్నుల వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్దతు ధరనూ ప్రకటించింది. ఏ గ్రేడ్ రకం రూ.1,960, కామన్ రకం రూ.1,940గా నిర్ణయించింది.
రైతు కష్టం వృథా కాకూడదని..
రైతు కష్టం వృథా కాకుండా, అన్నదాతకు నష్టం వాటిల్లకుండా, ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం జిల్లాలో వివిధ శాఖల అధికారులకు పలు బాధ్యతలు అప్పగించింది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి విజిలెన్స్‌ను రంగంలోకి దించుతోంది.
అధికారులకు విధులు..
ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసి, మిల్లర్ల వద్ద నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ పూర్తిగా వచ్చే వరకు ఈ ప్రక్రియలో ఉన్న అందరూ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసే బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించింది.
సరిహద్దులో చెక్‌పోస్టులు
భద్రాద్రి జిల్లా సరిహద్దు రాష్ర్టాలైన ఏపీ, ఛత్తీస్‌గఢ్ నుంచి ధాన్యం అక్రమంగా రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు, వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసే బాధ్యతను ఎస్స్పీకి అప్పగించింది. జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్, జిల్లా రవాణా శాఖ అధికారి తదితరులకు కూడా వివిధ రకాల బాధ్యతలు కేటాయించింది. జిల్లా ఇంటెలిజెన్స్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది.
రైస్ మిల్లర్లకు సూచనలు..
రైస్ మిల్లర్లందరూ జిల్లా మేనేజర్ వద్ద తప్పనిసరిగా అగ్రిమెంట్ చేయించుకోవాలి. ప్రతి మిల్లరూ తప్పనిసరిగా ఫాం ఏ-2 రిజిస్టర్‌ను నిర్వహించాలి. ఆ రిజిస్టర్లో సీఎంఆర్ ధాన్యానికి సంబంధించిన వివరాలు, ధాన్యం కొనుగోలు, ధాన్యం ఆడించిన వివరాలు, సీఎంఆర్ డెలివరీకి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి.
వారంలో కొనుగోళ్లు ప్రారంభం..
అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయి. వారం రోజుల్లో సెంటర్లు ప్రారంభిస్తాం. ఇప్పటికే కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. 154 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఇతర రాష్ర్టాల నుంచి గింజ కూడా రానివ్వం. అందుకే చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశాం.
-ప్రసాద్, డీఎం, సివిల్ సప్లయీస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా