
పోడు రైతులకు పారదర్శకంగా హక్కు పత్రాల పంపిణీ ప్రక్రియ
గ్రామస్థాయి అవగాహన సదస్సుల్లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్
ఇల్లెందు, నవంబర్ 8: అర్హులందరికీ చట్ట ప్రకారం పోడు భూముల హక్కు పత్రాలు జారీ చేస్తామని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అన్నారు. మండలంలోని సుదిమళ్ల గ్రామ పంచాయతీలో సోమవారం అటవీ హక్కుల అవగాహన సదస్సు జరిగింది. 32 చోట్ల జరిగిన అవగాహన సదస్సుల నుంచి 1,176 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. పోడు సాగుదారులు ప్రలోభాలకు గురికావద్దన్నారు. అధికారులు తెలియజేసిన సూచనలు, సలహాలతో ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోడు సమస్యలున్న గ్రామ పంచాయతీల్లో ఈ నెల 10 వరకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని, 11 నుంచి 12 వరకు దరఖాస్తులను ప్రజల నుంచి తిరిగి తీసుకుంటామని అన్నారు. అడవుల సంరక్షణ బాధ్యత సర్పంచులేదనన్నారు. రెవెన్యూ, అటవీ భూముల సమస్యలపై సమగ్ర నివేదికలు అందజేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తునూ రిజిస్టర్లో నమోదు చేసి రసీదు ఇస్తామన్నారు. ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, మండల ప్రత్యేకాధికారి మరియన్న, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో అప్పారావు, ఎంపీవో అరుణ్గౌడ్, సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ కృష్ణ, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.