
ములకలపల్లి, అక్టోబర్ 7: అన్నదాతల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ సత్ఫలితాలిస్తున్నాయనిఅన్నారు. భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్లతో కలిసి మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొలుత పూసుగూడెం, రాజుపేట, జగన్నాథపురం గ్రామాల్లో రైతువేదికలను ప్రారంభించారు. అనంతరం పొగళ్లపల్లిలో రూ.1.57 కోట్లతో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇళ్లను, రాజాపురం, జగన్నాథపురం, నల్లమూడి, గుట్టగూడెం గ్రామాల్లో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కోరారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ లాభసాటి పంటల సాగు ద్వారా రైతులు సంపన్నులు కావాలని అన్నారు. డీఏవో అభిమన్యుడు, పీఆర్ ఈఈ సుధాకర్, జడ్పీ సీఈవో విద్యాలత, ఎంపీపీ నాగమణి, జడ్పీటీసీ సున్నం నాగమణి, పీఏసీఎస్ చైర్పర్సన్ సునంద, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ పుల్లారావు, దమ్మపేట జడ్పీటీసీ వెంకటేశ్వరరావు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.