
భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పరిశీలన
ప్రత్యేక యంత్రాలతో నీటి లెక్కల నమోదు
కూసుమంచి రూరల్, అక్టోబర్ 7: మండలంలోని ఎర్రగడ్డతండా వద్ద నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), సెంట్రల్ వాటర్ కమిటీ (సీడబ్ల్యూసీ), ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఅండ్సీఏడీఏ) అధికారులు గురువారం సందర్శించారు. కృష్ణా నది నుంచి సాగర్ ఎడమ కాలువకు కేటాయించిన నీటిలో పాలేరు రిజర్వాయర్‌తోపాటు భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి వినియోగిస్తున్న కోటాను, నీటి వృథాను గురించి ప్రత్యేక యంత్రాలతో లెక్కలు తీసి నమోదు చేసుకున్నారు. ఎత్తిపోతల పథకం నుంచి విడుదల చేస్తున్న నీటి వివరాలను, వాటి రికార్డులను తనిఖీ చేశారు. యంత్రాలు, పంప్‌హౌజ్‌లను పరిశీలించారు. కృష్ణా నీటి వినియోగంపై రెండు రాష్ర్టాల మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సీబ్ల్యూసీ, కేఆర్ఎంబీ సీఈలు శివరాజన్, అనుపమ ప్రసాద్, ఐఅండ్ సీఏడీఏ సీఈ శంకర్‌నాయక్, ఎస్ఈ టీవీరావు, ఇరిగేషన్ డీఈఈ సమ్మిరెడ్డి, ఏఈఈలు పాల్గొన్నారు.