
ప్రశాంతమైన ప్రకృతి ఒడి.. ఇందిరానగర్ బడి
హరితహరం స్ఫూర్తితో ఆవరణంతా పచ్చదనమే..
పాఠశాల హెచ్ఎంకు హరితమిత్ర అవార్డు
కొత్తగూడెం, అక్టోబర్ 6: మొక్కలంటే ఎవరికైనా ఇష్టమే. కానీ వాటిని పెంచడం చాలా కష్టం. కన్నబిడ్డలను ఎలా పెంచుతామో మొక్కలనూ అలాగే పెంచడం ఇంకొంచెం కష్టంగా ఉంటుంది. కానీ దానినే ఎంతో ఇష్టంగా చేస్తారు ఆ ప్రధానోపాధ్యాయురాలు. ఆమె పాఠాలు బోధించే బడిలో పిల్లలకు ఎలా సంరక్షణ చర్యలు తీసుకుంటారో.. ఆ పాఠశాలలోని మొక్కలకూ అలాగే సంరక్షణ చర్యలు తీసుకుంటారు. ఆమే.. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మేకల జ్యోతిరాణి. ఆ స్కూల్ చూస్తే పచ్చని వేదికను చూసినట్లుంది. అక్కడి వాతావరణం ఆహ్లాదాన్నిస్తుంది. హరితహారం స్ఫూర్తితో 2015లో సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తానూ మొక్కలు పెంచాలని సంకల్పించారామె. తాను మొక్కలను నాటుతూ, పెంచుతూనే.. ఆ బడిలోని పిల్లలకూ అదే నేర్పించారు. దీంతో పాఠశాల ఆవరణం ఓ మినీ వనమైంది. సుమారు 250 మొక్కలు ఏపుగా పెరిగి హరిత వాతావరణాన్ని పంచుతున్నాయి. అందుకే.. ఇందిరానగర్ పాఠశాల అంటే కేవలం బడి మాత్రమే కాదు.. పకృతి ఒడి.
కలుపుతీసి.. నీళ్లు పోసి..
పాఠశాల అంటే కేవలం ఏడెనిమిది గంటలు ఉండిపోయే బడి మాత్రమే కాదు.. జీవితకాలంలో సగభాగం గడిపే నిలయం కూడా. అందుకే దాన్ని కూడా తన ఇంటిలాగే భావించింది ఆ ప్రధానోపాధ్యాయురాలు. తన పాఠశాలను అందంగా ముస్తాబుచేస్తోంది. పిల్లలనూ ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది. మొక్కలు నాటిన రోజు నుంచి ఇప్పటి వరకూ మొక్కలకు నీరు పోయడం, వాటి మధ్య పెరిగిన కలుపును తీసివేయడం వంటివి తన దినచర్యలో, విధిలో భాగంగా భావిస్తారామె. ఆమెతోపాటు పిల్లలు కూడా పాఠశాల ఆవరణలోకి అడుగు పెట్టారంటే ముందు మొక్కలకు నీళ్లు పోస్తారు. తరువాతే తరగతి గదిలోకి వెళ్తారు.
హరితమిత్ర అవార్డు..
మొక్కలంటే ఆమెకు ఎంతో ప్రేమ. అందుకే ఆమె తన స్కూల్లో మొక్కలు పెంచడంతోపాటు గ్రామంలోనూ మొక్కలు నాటేందుకు సహకరిస్తోంది. ఆమను స్ఫూర్తిగా తీసుకున్న గ్రామస్తులు కూడా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులూ సహకారం అందిస్తున్నారు. వీధుల్లోనూ మొక్కలు నాటారు. ఈ క్రమంలో ఆమెను హరితమిత్ర అవార్డు కూడా వరించింది. ఆ పురస్కారం కింద వచ్చిన రూ.2 లక్షల నగదును తిరిగి అదే పాఠశాల అభివృద్ధికి వెచ్చించారు.
పాఠశాలలో మొక్కలూ ఉండాలి..
పాఠశాలలు మొక్కలూ ఉండాలి. అప్పుడు అక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. నాక్కూడా మొక్కలంటే ప్రాణం. 2015 నుంచి మొక్కలు పెంచుతున్నాను. గతంలో చాతకొండ స్కూల్లో పనిచేసినప్పుడు అక్కడ కూడా విరివిగా మొక్కలు పెంచాను. స్కూలంతా పచ్చగా ఉంటే.. పిల్లలు కూడా చల్లటి వాతావరణంలో చదువుకుంటారు. ఆడుకుంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హరితనిధిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.
-మేకల జ్యోతిరాణి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఇందిరానగర్