
కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలు
ఏటా 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి పెంపు లక్ష్యం
నయా గనులపై సమీక్షలో సింగరేణి సీఎండీ శ్రీధర్
కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 6: సింగరేణి ఆధ్వర్యంలో వచ్చే మూడేళ్లలో పది కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి రూపకల్పన చేశామని, వీటికి సంబంధించి ప్రతిపాదనలు, అనుమతులు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో వివిధ విభాగాల డైరెకర్లు, ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అలాగే అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 2021-22 సంవత్సరంలో ప్రారంభించనున్న జీడీకే కోల్‌మైన్, ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్, వీకే కోల్‌మైన్, జీడీకే-10లోని ఆర్జీ కోల్మైన్ల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలుగా ప్రతిపాదించామని తెలిపారు. అనుమతుల తర్వాత ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. దీనితో 2021-22లో సింగరేణి సంస్థ 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తుందని పేర్కొన్నారు. 2022-23లో ప్రారంభించాల్సిన ఐదు గనుల ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో ఎంవీకే ఓసీపీ, గోలేటి ఓసీపీ, జేకే ఓసీపీ, న్యూ పాత్రపద గనుల ప్రతిపాదనలు, అనుమతులపై చర్చించారు. ఈ గనులకు అనుమతులు లభించిన అనంతరం నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే 2023-24 నాటికి సింగరేణి సంస్థ 850 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ మూడేళ్ల కాలంలో పాత గనులు కొన్ని మూత పడుతున్న నేపథ్యంలో యేటా 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని, ఇందుకు అనుగుణంగా కొత్త గనుల ప్రారంభ ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.