
ఖమ్మం జిల్లాలో 2,64,532 ఎకరాల్లో వరి సాగు
5,48,852 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం
4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యంగా ముందుకు..
246 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఖమ్మం, అక్టోబర్ 5;ఈ సారి వానకాలం ధాన్యం కొనుగోలు చేయమని, మూడేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో రైతులు ఆందోళన చెందారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులతో మాట్లాడి ఈ సారి ధాన్యం కొనుగోలు చేసేలా ఒప్పించారు. దీంతో ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఖమ్మం జిల్లాలో 2,64,532 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఒక హెక్టారులో 5 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 246 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. గన్నీ సంచుల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తుండడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్వవైభవం సంతరించుకున్నాయి. దీంతో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. గతానికంటే రెట్టింపు స్థాయిలో కర్షకులు వరి సాగు చేస్తున్నారు. అయితే, ఈ వానకాలం ధాన్యాన్ని కొనుగోళ్లు చేయమని, మూడేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చించారు. ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా ఒప్పించారు. దీంతో జిల్లా అధికారులు ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ ప్రణాళిక రూపొందించింది. జిల్లాలోని 21 మండలాల్లో రైతులు 2,64,532 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఒక హెక్టారులో 5 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా1,05,813 హెక్టార్లలో 5,48,852 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి రానున్నది. 60 వేల మెట్రిక్ టన్నులు రైతుల అవసరాలకు పోను.. 8,852 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు సీడ్ కోసం వినియోగించుకోనున్నారు. మిగిలిన 4,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యంలో.. మిల్లర్లు నేరుగా 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. మిగిలిన 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి పౌరసరఫరాల అధికారులు అంచనాలు రూపొందించారు. కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 246 కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు.
గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు..
జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి 1.12 కోట్ల గన్నీసంచులు అవసరం. ప్రస్తుతానికి 80,93,219 గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి.. వీటిలో 39,66,296 గన్నీ సంచులను ప్రభుత్వం తెప్పించాల్సి ఉంది. ఒక్కసారి ఉపయోగించిన గన్నీసంచులు 9,449, రేషన్దుకాణాల నుంచి 48,784, పాతవి 40,68,690 గన్నీ సంచులు ఉన్నాయి. అధికారులు అంచనాలకు తగ్గట్టు ధాన్యం దిగుబడి వస్తే మరో 30 లక్షల గన్నీ సంచులు అవసరమవుతాయి.
కొనుగోళ్లు కేంద్రాలు..
జిల్లాలో ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్లు చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. వీటికి 246 కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డీసీఎంఎస్ 29, ఐకేపీ 60, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 152, వ్యవసాయ మార్కెట్ల ద్వారా 5 మొత్తం 246 కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. టార్ఫాలిన్లు 7,380 అవసరం కాగా.. 5,755 అందుబాటులో ఉన్నాయి. మరో 1,625 టార్ఫాలిన్లు తెప్పించాల్సి ఉంది. ప్యాడీ క్లీనర్లు 71, తేమ కొలిచే యంత్రాలు 381, వెయింగ్ మిషన్లు 527, తూర్పార బట్టే మిషన్, కాంటాలు, పొట్టు, ధాన్యం నాణ్యతను చెక్ చేసే జాలీలు అందుబాటులో ఉంచారు.