
నేడు ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభం
తీరొక్క పూలను కొలిచే అపురూప ఘట్టం
తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ వేడుక
తొమ్మిది రోజులపాటు సందడి
ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, అక్టోబర్ 5: బతుకమ్మ బతుకమ్మ.. ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సందడి మొదలు కానున్నది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పల్లె, పట్నం, నగరాల్లో తొమ్మిది రోజులపాటు మహిళలు ఆటపాటలతో సందడి చేయనున్నారు.
బతుకునిచ్చేది, బతుకు నేర్పేది బతుకమ్మ. ప్రకృతితో మమేకమవుతూ, రంగురంగుల పూలను తెలంగాణ ఆడబిడ్డలు పేర్చే అందమైన పండుగ బతుకమ్మ. ప్రకృతికి, మనిషికి మధ్య సంబంధానికి ప్రతీక బతుకమ్మ. మన సంస్కృతికి నిలువెత్తు రూపం బతుకమ్మ. సాధారణంగా ఎక్కడైనా పూలతో దేవుడిని పూజిస్తారు. కానీ ఆ పూలనే పరమ పవిత్రంగా పూజించడం తెలంగాణ ప్రత్యేకం. ఇది అనాదిగా వస్తున్న జీవన సంప్రదాయం. ‘బతుకునివ్వమ్మా.. బతుకమ్మా..’ అని వేడుకోవడం తెలంగాణ మట్టికున్న మహిమాన్విత ఆచారం. పేద, ధనిక, పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. అంతటి విశిష్టత గల పండుగ రానే వచ్చింది. తొమ్మిది రోజుల పాటు ఆటాపాటలతో మహిళలు సందడి చేయనున్నారు.
అశ్వయుజమాసం పాఢ్యమి రోజున ప్రారంభమయ్యే ఈ వేడుకలను ఉమ్మడి జిల్లాలో ప్రజలు వైభవంగా నిర్వహించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు, పాఠశాల, కళాశాలల్లో బొడ్డెమ్మ, బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి తర్వాత రోజు నుంచి చిన్నారులు బతుకమ్మను బొడ్డెమ్మగా పిలుస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సల్లుడు బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, గద్దెల బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బావి బొడ్డెమ్మ తర్వాత బతుకమ్మ సంబురాలను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు. ఇంటి ఆడపడుచుగా పేర్కొంటూ బతుకమ్మ చుట్టూ వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ.. ‘ఏమేమి పువ్వెప్పునే గౌరమ్మ..’ అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు.
పూల సందడి : బతుకమ్మ సంబురాలు బుధవారం నుంచి ప్రారంభం కానుండడంతో చిరువ్యాపారులు వివిధ రకాల పూలను విక్రయించేందుకు తీసుకొచ్చారు. కొత్తగూడెం ఎంజీరోడ్, సూపర్‌బజార్ సెంటర్లలో రోడ్డు పక్కన పువ్వులను విక్రయానికి ఉంచడంతో మహిళలు, స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
ఒకటో రోజు ఎంగిలిపూల బతుకమ్మ..
బతుకమ్మ నవరాత్రుల్లో మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. బతుకమ్మను పేర్చడానికి వాడే పూలను ఒకరోజు ముందే తెంపుకొని వాటిని వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజు ఎంగిలిపువ్వు అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ అంటారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కెరు, బెల్లం కలిపి పెడతారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ అంటారు. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదిస్తారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ అంటారు. పిండితో తయారు చేసి అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని ఆరో రోజు బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అంటారు. సకినాల పిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ అంటారు. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి నివేదిస్తారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు.