
పచ్చని తెలంగాణే కేసీఆర్ స్వప్నం
ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లిలో మెగా హరితహారం
మొక్కకు పుట్టిన రోజు చేసిన ఎమ్మెల్యే
సత్తుపల్లి, జూలై 5: హరితహారం కార్యక్రమం దేశానికే స్ఫూర్తిదాయకమని, తెలంగాణ రాష్ర్టాన్ని పూర్తి హరిత తెలంగాణగా మార్చడమే సీఎం కేసీఆర్ స్వప్నమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఏడో హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక జ్యోతి నిలయం పక్కన ఉన్న స్మృతివనంలో సోమవారం మెగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ తరిగిపోయే వనరులను పునరుద్ధరించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో హరితహారాన్ని ప్రారంభించారని, 33 శాతం అడవులను పునరుద్ధరించడమే సీఎం ధ్యేయమని అన్నారు. సత్తుపల్లిలో 68,500 మొక్కలు నాటగా అందులో 90 శాతం మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరుగుతున్నాయని అన్నారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ మొక్కలు నాటాలని, బాధ్యతగా వాటిని సంరక్షించాలని సూచించారు. సత్తుపల్లి పట్టణ ప్రజల కోసం అత్యాధునికంగా అటవీశాఖ ఆధ్వర్యంలో అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతీ శంకర్రావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, రైతుబంధు సమితి కన్వీనర్ గాదె సత్యం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, కమిషనర్ సుజాత, తహసీల్దార్ మీనన్, ఎంపీడీవో సుభాషిణి, ఎఫ్ఆర్వో వెంకటేశ్వర్లు, నాయకులు మట్టా ప్రసాద్, చల్లగుళ్ల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
మొక్కకు పుట్టినరోజు వేడుక..
ఆరో విడత హరితహారంలో భాగంగా నిరుడు జూలై 5న జ్యోతి నిలయం స్కూల్ పక్కన స్మృతివనంలో నాటిన మొక్కకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేక్ కట్ చేసి మొక్కకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.