
వ్యవస్థీకృత నేరాలను తీవ్రంగా పరిగణిస్తాం: ఖమ్మం సీపీ
విష్ణు ఎస్ వారియర్
మామిళ్లగూడెం, జూలై 5: మానవ హక్కులు ఉల్లంఘిస్తూ జరిగే మానవ అక్రమ రవాణాపై కఠిన శిక్షలు ఉంటాయని సీపీ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించారు. జిల్లాలో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్‌కు సంబంధించి మానవ రవాణా నిరోధక విభాగం, మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఖమ్మం పోలీసు కమిషనరేట్‌లో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరంగా పరిగణించే ఇలాంటి కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చేయడంతోపాటు బాధితులకు తక్షణ న్యాయం చేయాల్సి ఉంటుందని అన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ఖమ్మం జిల్లాలో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. సీసీఎస్ సీఐ నవీన్ నేతృత్వం వహించే ఈ బృందంలో పోలీసు సిబ్బంది ఉంటారని అన్నారు. జిల్లాలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని డయల్ 100కు గానీ లేదా సీసీఎస్ సీఐ సెల్ నెంబరు 9440904881కు గానీ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఇంజారపు పూజ, సీఐలు నవీన్, అంజలి, తుమ్మ గోపి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి
ప్రజా దివస్‌లో వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. ఖమ్మం పోలీసు కమిషనరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా దివస్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత పోలీసు స్టేషన్లకు రిఫర్ చేశారు.