
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
పాఠశాల విద్యార్థులకు సురక్షిత తాగునీరు
సీఎంవో ప్రత్యేక కార్యదర్శి ఆదేశంతో లక్ష్యం పూర్తి
ఖమ్మం జిల్లాలో 1,163 పాఠశాలలకు నల్లా కనెక్షన్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,275 స్కూళ్లకు..
ఖమ్మం, అక్టోబర్ 3: మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని అందిస్తున్న ప్రభుత్వం.. ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ సరఫరా చేయాలని నిర్ణయించింది. గాంధీ జయంతి రోజు అయిన అక్టోబర్ 2లోపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి బడికీ భగీరథ నీరు అందించాలని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి, మిషన్ భగీరథ సెక్రటరీ స్మితా సబర్వాల్ ఆదేశించడంతో సంబంధిత శాఖ అధికారులు లక్ష్యాన్ని చేరుకున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1,311 పాఠశాలలు ఉండగా వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,163 పాఠశాలలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 1,280 పాఠశాలలు ఉండగా వాటిలో 1,275 పాఠశాలలకు మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్లు ఇచ్చారు. భద్రాద్రి జిల్లాలో మిగిలిన 5 పాఠశాలలు గ్రామాలకు దూరంగా ఉండడం, మెయిన్ పైపులైన్ ఆ ప్రాంతంలో లేకపోవడం వంటి కారణాలతో వాటికి నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. వాటికి కూడా త్వరలోనే కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా భగీరథ నీరు అందుతోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలకు, చర్చిలకు, మసీదులకు, దేవాలయాలకు ఉచితంగా నల్లా కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. వీటి ద్వారా భక్తులకూ స్వచ్ఛమైన నీటిని అందించనున్నారు. ఇవేగాక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు ఎక్కడ ఉంటే అక్కడ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు..
ఖమ్మంలో 1,311 స్కూళ్లకు..
ఖమ్మం జిల్లాలో 1004 ప్రాథమిక పాఠశాలలు, 211 ఉన్నత పాఠశాలలు, 56 గురుకులాలోపాటు కేంద్రీయ విద్యాలయాలు, మెడల్ స్కూళ్లు, నవోదయ స్కూళ్లు, 14 కేజీబీవీలు, 19 జూనియర్ కళాశాలలు, 5 డిగ్రీ కళాశాలలు, ఒక పీజీ కళాశాల ఉన్నాయి. మొత్తం 1,311 ప్రభుత్వ విద్యాసంస్థలో మున్సిపాలిటీల్లోని 148 పాఠశాలలకు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1,163 పాఠశాలలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. గతంలో పాఠశాలల విద్యార్థులకు మంచినీరు అందాలంటే ఎంతో వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఆ సమస్య తీరినట్లయింది.
భద్రాద్రి జిల్లాలో 1,275 స్కూళ్లకు..
భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం పట్టణాల్లోని పాఠశాలలకు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 1,280 పాఠఠశాలల్లో 1,275 పాఠశాలలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత నీరు అందుతోంది.
అన్ని గ్రామాలకూ సురక్షిత నీళ్లు..
పాఠశాలలకేగాక ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామాలకూ మిషన్ భగీరథ మంచినీరు అందుతోంది. ఖమ్మం జిల్లాలోని 969 గ్రామాలకు గాను 916 గ్రామాలకు, భద్రాద్రి జిల్లాలోని 1,514 గ్రామాలకు గాను 1,260 గ్రామాలకు ఈ నీరు సరఫరా అవుతోంది. ట్యాంకుల నుంచి కనెక్షన్ల ద్వారా ఇంటింటికీ అందిస్తున్నారు. గ్రామాల్లో లబ్ధిదారుల వివరాలను సైతం మిషన్ భగీరథ అధికారులు ఆన్లైన్ చేశారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ నల్లా కనెక్షన్
సీఎంవో ప్రత్యేక కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చాం. ఖమ్మం జిల్లాలో నూరు శాతం పాఠశాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చేశాం.భద్రాద్రి జిల్లాలో ఐదు పాఠశాలలు మినహా అన్ని పాఠశాలలకు నల్లా కనెక్షన్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నాం.
-కే.శ్రీనివాస్, సీఈ, మిషన్ భగీరథ