
ఏర్పాట్లలో నిమగ్నమైన పౌరసరఫరాలశాఖ
జిల్యావ్యాప్తంగా 14,713 మంది అర్హులు
ఖమ్మం, జూలై 2: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు జారీకి కసరత్తు ప్రారంభించింది. గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డులు ఇవ్వాలని యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారులు మూడు రోజులుగా కొత్త రేషన్ కార్డులు జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి కొత్త కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం 16,089 మంది దరఖాస్తు చేసుకోగా 14,713 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. వీరిలో 1,376 మంది దరఖాస్తులు ఆర్ఐ, తహసీల్దారు లాగిన్‌లో ఉన్నాయి. వీటిని రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అర్హులను గుర్తిస్తారు. మరో 7,381 దరఖాస్తులు జిల్లా పౌరసరఫరాల అధికారి లాగిన్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తుదారులందరూ కొత్త కార్డులకు అర్హులే. అర్హులందరూ త్వరలో మీ సేవ కేంద్రాలకు వెళ్లి రేషన్ కార్డు ప్రింట్ తీసుకోవచ్చు.
‘యాడింగ్’ కార్డులకు మార్గదర్శకాలు లేవు..
అతి త్వరలో అర్హులందరికీ కొత్తరేషన్ కార్డులు అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వందలాది మంది కార్డు ఉండి పిల్లల పేర్లు ‘యాడ్’ చేసుకునేందుకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంకొందరు పిల్లల వివాహం చేసిన తర్వాత వారి పేర్ల తొలగింపునకు దరఖాస్తులు ఇచ్చారు. ఈ దఫాలో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికే కార్డులు అందుతాయని పౌరసరఫరాలశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. యాడింగ్, డిలీట్ ఆప్షన్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవని చెప్తున్నారు. కొత్త కార్డులు మంజూరైన వారు ఈ నెల నుంచే రేషన్ సరుకులు తీసుకోవచ్చంటున్నారు.
‘మీ సేవ’లో వివరాలు..
రేషన్‌కార్డు మంజూరుపై ప్రతిరోజు వందలాది మంది లబ్ధిదారులు ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని సివిల్ సప్లయిస్ కార్యాలయానికి వస్తున్నారు. దీంతో ఆ శాఖ అధికారులు ప్రజలకు సమాధానం చెప్పడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. దరఖాస్తుదారలు ‘మీ సేవ’ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు రశీదు ఇస్తే స్టేటస్ తెలుస్తుంది. లేదా ఆర్ఐ, తహసీల్దార్ లాగిన్‌లో ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో స్టేటస్ తెలుసుకోవచ్చు. ఒకవేళ వారి స్టేటస్‌లో డీఎస్వో లాగిన్ అని ఉంటే ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వారికి కొత్త కార్డు అందుతుంది. డీఎస్వో లాగిన్‌లో ఉన్న దరఖాస్తులన్నీ మూడు రోజుల్లో క్లియర్ అవుతాయని అధికారులు తెలిపారు.