
గడిచిన 24 గంటల్లో 39,5 మిల్లీమీటర్ల వర్షపాతం
82 వేల ఎకరాలకు చేరిన సాగు
ఖమ్మం వ్యవసాయం, జూలై 2 : జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 39.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. అత్యధికంగా సింగరేణి మండలంలో 91.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. మధిర మండలంలో 90.2 మి.మీ, కామేపల్లి మండలంలో 99.4 మి.మీ, రఘునాథనాలెం మండలంలో 54,5 మి.మీ, వైరా మండలంలో 49.4 మి.మీ, ఖమ్మం అర్బన్ మండలంలో 46.2 మి.మీ, ఖమ్మం రూరల్ మండలంలో 46.8 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. ఖమ్మం శివారు మండలాల్లో భారీ వర్షపాతం నమోదు కాగా, ఇతర మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసింది.
వేగంగా సాగు ప్రక్రియ
వానకాలం సాగుకు సంబంధించి వరితోపాటు పత్తి, ఇతర పంటల సాగు ప్రక్రియ వేగం అందుకున్నది. జిల్లా వ్యాప్తంగా 82,187 ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. వరి 5,418 ఎకరాలు, పత్తి 66,686 ఎకరాలు, చెరుకు 1,179 ఎకరాలు, పెసర 8,342 ఎకరాలు, కంది 433 ఎకరాల్లో సాగైంది. మరో 31,913 ఎకరాల్లో వరినారు మడులు పోసుకొని నాట్లు వేసుకునేందుకు సాగు రైతులు సిద్ధంగా ఉన్నారు. జూన్ నెల సాధారణ వర్షపాతం 105.2 మిల్లీ మీటర్లు కాగా.. 160.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో 82.2శాతం అధికంగానే జిల్లాలో వర్షపాతం నమోదైనైట్లెంది.
పొంగిన వాగులు
కొణిజర్ల, కారేపల్లి, ఏన్కూరు, పెనుబల్లి : మండల వ్యాప్తంగా కురిసిన భారీవర్షానికి వాగులు, వంకలు, కుంటలు నిండిపోయాయి. తీగలబంజర సమీపంలోని పగిడేరు ఉధృతంగా ప్రవహించగా, అంజనాపురం సమీపంలోని నిమ్మవాగు ఉప్పొంగింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కారేపల్లిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కారేపల్లి పెద్ద చెరువుకు జలకళ సంతరించుకున్నది. ఏన్కూరు మండలంలోని జన్నారం ఏటివాగు ఉప్పొంగడంతో పల్లిపాడు టు ఏన్కూరు రహదారిలో రాకపోకలు స్తంభించిపోయాయి. పెనుబల్లి మండలంలోని వీయం బంజరులో కొత్తగూడెం రోడ్డు తిరువూరు రోడ్డు వరకు వరద ప్రవహించింది.