
పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. పోడు భూములు, అటవీ ప్రాంత సంరక్షణపై సోమవారం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ వీపీ గౌతమ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు సమస్యల శాశ్వత పరిషారం కోసం సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నాను. సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. జిల్లాలో 1.58 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉన్నదన్నారు. 10 మండలాల్లో 21 వేల ఎకరాల అటవీ భూమి ఆక్రమణలో ఉందన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారంతో పాటు అడవులను సంరక్షించేందుకు సీఎం కేసీఆర్ క్యాబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఇక ముందు పోడు పేరుతో అడవులను నరికితే కఠిన చర్యలుంటాయన్నారు. అడవులను నరికివేస్తే వాతావరణ సమతుల్యానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. పోడు భూముల సమస్య పరిషారానికి అటవీశాఖ, రెవెన్యూశాఖ, పోలీస్‌శాఖ సమన్వయంతో పని చేయాలన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. పోడు భూముల క్లెయిమ్స్ సేకరణ, పరిశీలన, క్షేత్రస్థాయి సందర్శన, సర్వే ప్రక్రియకు జిల్లావ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, ఏన్కూరు, తల్లాడ, కొణిజర్ల, చింతకాని, రఘునాథపాలెం, కామేపల్లి, సింగరేణి పది మండలాల్లో పోడు సమస్య ఎక్కువ ఉందన్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్ మాట్లాడుతూ.. పోడు భూముల క్లెయిమ్స్ ఆధారంగా రైతులకు న్యాయం చేస్తామన్నారు. అనంతరం సమావేశానికి హాజరైన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సలహాలు, సూచనలను అధికారులకు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు రాములునాయక్, హరిప్రియానాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సీపీ విష్ణు ఎస్ వారియర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ కలెక్టర్ రాహుల్, అటవీ సంరక్షణ అధికారి డి.భీమూనాయక్, జిల్లా అటవీ అధికారి ప్రవీణ, పోలీస్, అటవీ, రెవెన్యూశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.