
కొత్తగూడెం సమీపంలో రూ.90 కోట్లతో నిర్మాణం
85 శాతం పనులు పూర్తి
మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం
అన్నిశాఖల కార్యకలాపాలు ఒకే చోట..
అధికారుల నివాసాలూ ఇక్కడే..
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా
కొత్తగూడెం, నవంబర్ 1 : నాలుగేళ్ల కిందట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవతరించింది.. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలు, గిరిజనులకు పాలనను మరింత దగ్గర చేసింది.. ఇదే ఒరవడిలో జిల్లాకేంద్రం సమీపంలో అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే సముదాయంలోకి తీసుకురావాలని సంకల్పించింది.. ప్రతిష్ఠాత్మకంగా ‘ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్’ నిర్మిస్తున్నది.. ఈ సముదాయంలో అన్నిశాఖల కార్యాలయాలతో పాటు అధికారుల నివాస గృహాలూ పూర్తవుతున్నాయి.. యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నది.. మరో నాలుగైదు నెలల్లో అన్ని సదుపాయాలతో కలెక్టరేట్ అందుబాటులోకి రానున్నది..
ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవాలంటే ఏ అధికారి కార్యాలయం ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఆఫీసు పనిమీద పట్నం వస్తే అర్జీలు ఇవ్వడానికి అడ్రస్‌లు వెతుక్కునే పరిస్థితి. ఏ కార్యాలయానికి వెళ్లాలన్నా ఆటో చార్జీలకే అధిక మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి. అధికారిక పనుల గురించి ఆయా శాఖల అధికారులు కూడా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలంటే ఇబ్బంది. వీటన్నింటికీ సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారు. అన్ని శాఖలూ ఒకే దగ్గర ఉండాలని నిర్ణయించారు. దాదాపు 60 శాఖలను ఒకే దగ్గరకు చేర్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నూతన కలెక్టరేట్లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల మధ్యలో కేఎస్ఎం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ భవన సమాదాయలు ముస్తాబవుతున్నది. దీంతో పాటు రెసిడెన్షి యల్ క్వార్టర్స్ నిర్మాణ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ భవనం సకల హంగులతో సిద్ధమవుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న ఈ సమీకృత భవనంలో కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వో స్థాయి అధికారుల కార్యాలయాలతోపాటు అన్ని శాఖల అధికారుల ఆఫీసులూ ఒకే చోట కొలువుదీరనున్నాయి. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తవగా డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. కలర్స్, కోటింగ్, ఫ్లోరింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఫ్లంబింగ్ పనులు చేస్తున్నారు. నూతన కలెక్టరేట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు పరిపాలన మరింత చేరువ కానుంది.
అన్ని శాఖలు అక్కడి నుంచే..
కొత్తగా అనేక జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం.. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసిన సంగతి విదితమే. అలాగే కొన్ని కొత్త జిల్లాల్లోనూ నూతన కలెక్టరేట్ సముదాయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలోనూ సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 2019లో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయని, మార్చి నెలాఖరు వరకు వంద శాతం పూర్తి చేస్తామని అదికారులు ప్రభుత్వానికి పంపించిన నివేదికలో పేర్కొన్నారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు పనులు చేయిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వోతోపాటు సంబంధిత కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో వివిధ శాఖలకు చెందిన కార్యాలయాల కోసం గదులను కేటాయించారు. సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ గది, లిఫ్టులు, మీటింగ్ హాల్, గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. ముందు భాగంలో పూల మొక్కలతో గార్డెన్ ఏర్పాటు చేసి వాహనాలను నిలిపేందుకు వీలుగా విశాలమైన పార్కింగ్ వసతి కల్పిస్తున్నారు. ఈ భవన సముదాయం ప్రారంభమైతే భద్రాద్రి జిల్లా ప్రజలకు ఒకే చోట నుంచి అన్ని శాఖలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తాయి.
మార్చి నాటికి పూర్తవుతుంది..
సర్వ హంగులతో కలెక్టర్ కార్యాలయం సిద్ధమవుతోంది. మార్చి నెలలో పూర్తవుతుంది. ఇప్పటికే పనులను పరిశీలించాను. పనులు వేగవంతంగా చేయాలని ఆదేశించాను. సమీకృత కలెక్టరేట్‌తో పాటు రెసిడెన్సియల్ భవన సముదాయాల పనులూ జరుగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయితే అన్ని జిల్లా శాఖల కార్యాలయాలు అక్కడే ఉంటాయి. ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.
-అనుదీప్, భద్రాద్రి కలెక్టర్