
నేటి నుంచి ఆడపడుచులకు చీరెల పంపిణీ
నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారుల నియామకం
రేషన్‌దుకాణాల వారీగా జాబితా సిద్ధం
భద్రాద్రి జిల్లాలో 3.66 లక్షల మందికి లబ్ధి
15 రకాల డిజైన్లు, 17 రంగుల్లో చీరెలు
కొత్తగూడెం, అక్టోబర్ 1;సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ.. ఆడపడుచులు సందడిగా జరుపుకునే వేడుక.. ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా బతుకమ్మ కానుకగా ఆడబిడ్డలకు చీరెలను పంపిణీ చేస్తున్నది. అయితే, గతానికంటే భిన్నంగా ఈ సారి నేతన్నలు 15 రకాల డిజైన్లతో వివిధ రంగుల్లో మగువలు మెచ్చేలా.. వారి మనసుకు నచ్చేలా చీరెలను తయారు చేశారు. వీటిని పండుగకు ముందే అతివలకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామాలకు చీరెలను తరలించారు. రేషన్ దుకాణాల వారీగా జాబితా సిద్ధం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శనివారం నుంచి చీరెలు పంపిణీ చేయనున్నారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రేషన్‌కార్డు కలిగిన కుటుంబాల్లోని మహిళలందరికీ వీటిని అందజేయనున్నారు. జిల్లాలో మొత్తం 3,66,088 మంది మహిళలు ఉండగా.. వారందరికీ చీరెలు అందనున్నాయి.
ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా అందిస్తున్న చీరెలు భద్రాద్రి జిల్లాకు చేరాయి. శనివారం నుంచి చీరెల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం నియోజకవర్గాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. రేషన్ దుకాణాల వారీగా జాబితాను రూపొందించారు. ఈ సారి 15 రకాల డిజైన్లు, 17 రంగుల్లో మగువలు మెచ్చేలా చీరెలు తయారు చేశారు. నేటి నుంచి పంపిణీ చేసేలా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కొత్తగూడెం పట్టణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చీరెలు పంపిణీ చేయనున్నారు.
జిల్లాలో 3,66,088 మంది మహిళలకు చీరెలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండళౠలు ఉన్నాయి. మొత్తం 3,66,088 మంది మహిళలు ఉన్నారు. వారందరికీ ఇప్పటి వరకు 2,05,000 చీరెలు ఆయా మండలాలకు చేరాయి. కొత్తగూడెం లో 73,272, ఇల్లెందులో 60,768, భద్రాచలం 47,922, అశ్వారావుపేట 73,272, పినపాక 75,564 మందికి చీరెలు పంపిణీ చేయనున్నారు. ఆయా మండలాల పరిధిలో తహసీల్దార్లు చీరెలను పంపిణీ కేంద్రాలకు చేర్చారు. వీటి పంపిణీకి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.
5 రకాల డిజైన్లతో చీరెలు
ఈ సారి నేతన్నలు 15 రకాల డిజైన్లతో వివిధ రంగులతో చీరెలు తయారు చేశారు. ఏటా బతుకమ్మ వచ్చిందంటే ఆడపడుచులు పండుగ కానుక చీరెల కోసం ఆసక్తి ఎదురుచూస్తారు. ఈ సారి పండుగకు ముందుగానే అతివలకు అందించేందు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రేషన్‌దుకాణాలు, మెప్మా, సెర్ప్ కార్యాలయాల్లో రిసోర్స్పర్సన్లు, విలేజ్ ఆర్గనైజర్ల సహకారంతో చీరెలను పంపిణీ చేయనుంది.
ప్రత్యేక అధికారులు వీరే..
జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీకి కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక అధికారులను నియమించారు. పినపాకకు ఆర్డీవో స్వర్ణలత, ఇల్లెందు సీఈవో విద్యాలత, వైరా, కొత్తగూడెంకు డీఆర్డీవో మధుసూదనరాజు, అశ్వారావుపేటకు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భద్రాచలం నియోజకవర్గానికి ఐటీడీఏ పీవోను కేటాయించారు. మండల, గ్రామస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
సంబురంగా పండుగ జరుపుకోండి
సీఎం కేసీఆర్ ఆడపడుచులకు పెద్దన్నగా అండగా నిలుస్తున్నారు. ఏటా బతుకమ్మ కానుకగా చీరెలు అందించడంతో ఆడపడుచులు ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. వివిధ డిజైన్లతో మన్నికైన చీరెలు వచ్చాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సంబురంగా పండుగ జరుపుకోవాలి.
తొలిరోజు బతుకమ్మ చీరెతో ఆటాపాట
రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరెలు అందించడం అభినందనీయం. తెలంగాణలో ఆడపడచులకు చీరెలు పెట్టడం సంప్రదాయం. దీన్ని కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు ఆడబిడ్డల తరఫున కృతజ్ఞతలు. ఆడపడచుల ఆశీర్వాదం కేసీఆర్ సార్‌కు ఉంటుంది.