
సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి
మధిరరూరల్, అక్టోబర్ 1: రైతులు పండించిన పంటలకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలన్నారు. శుక్రవారం మధిరలోని సీపీఎం కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన అవసరం పాలకులపై ఉందన్నారు. కేంద్ర చట్టాలు అమలు చేస్తే భవిష్యత్లో రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న విద్యుత్ చట్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విద్యుత్ చట్టాలతో రైతులు ఎలా ఇబ్బంది పడాతారు?’ అన్న అంశంపై తాను ‘రైతన్న’ సినిమాను తీశానన్నారు. ప్రజలు, రైతులు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు సినిమాను వీక్షించాలని కోరారు. సమావేశంలో సీపీఎం, సీపీఐ నాయకులు శీలం నరసింహారావు, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘రైతన్న’ సినిమా ఫ్రీ షో
కొత్తగూడెం కల్చరల్, అక్టోబర్ 1: కొత్తగూడెంలోని విశ్వరూప థియేటర్లో శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి నటించిన ‘రైతన్న’ సినిమాను ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చిత్రాన్ని వీక్షించనున్నారు. టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు ఉచిత ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రదర్శనకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జడ్పీచైర్మన్ కోరంను కలిసిన ఆర్.నారాయణమూర్తి
టేకులపల్లి, అక్టోబర్ 1: ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి శుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, లక్ష్మి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి వెంట టీఆర్ఎస్ నాయకులు హేమ్లా నాయక్, శంకరాచారి, జానీ, తిరుమలరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.