
ఎమ్మెల్యే సండ్ర , కలెక్టర్ గౌతమ్
సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరేలా కృషి
చేతన ఫౌండేషన్ చేయూతతో దివ్యాంగులకు 60 ట్రైసైకిళ్ల పంపిణీ
94 మంది లబ్ధిదారులకు రూ.94 లక్షల విలువైన చెక్కులు అందజేత
కల్లూరు, అక్టోబరు 1: దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ట్రైసైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో చేతన ఫౌండేషన్ రూ.6 లక్షలతో సమకూర్చిన 40 ట్రై సైకిళ్లు, 20 వీల్చైర్లను కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాలకు చెందిన పలువురు దివ్యాంగులకు పంపిణీ చేసి మాట్లాడారు. దివ్యాంగుల గుర్తింపు బాధ్యతలను ఎంపీడీవోలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సామాన్యులను ఆదుకునేందుకు ముందుంటానన్నారు. నిరుపేదలు, దివ్యాంగులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న వారికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఇది సంక్షేమ సర్కార్ అని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే చొరవతో నియోజకవర్గంలో పలు రకాల సేవలు అందుతున్నాయన్నా కలెక్టర్ అన్నారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు అండగా నిలుస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, ‘తోపుడు బండి’ సాధిక్ అలీని సన్మానించారు. ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వెనిగర్ల అనిల్, రంగారావును అభినందించారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాలకు చెందిన 94 మందికి విడుదలైన రూ.94 లక్షల విలువైన చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలెక్టర్ వీపీ గౌతమ్, కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆడబిడ్డలకు మేనమామగా సీఎం కేసీఆర్ కానుక అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు పాలెపు రామారావు, వీరమోహనరెడ్డి, కనగాల వెంకట్రావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, రైతుబంధు సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, సొసైటీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, సర్పంచ్ లక్కినేని నీరజ రఘు తదితరులు పాల్గొన్నారు.