
సీఎం కేసీఆర్‌తోనే పోడు రైతులకు న్యాయం
తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది..
ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్
కొత్తగూడెంలో అఖిల పక్ష సమావేశం
పాల్గొన్న ఎంపీ కవిత, ప్రభుత్వ విప్ రేగా, ఎమ్మెల్యేలు
కొత్తగూడెం, అక్టోబర్ 31: ‘సీఎం కేసీఆర్‌తోనే పోడు భూముల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. సమస్య శాశ్వత పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.. ఇప్పటికే మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.. ఈ కమిటీ ఇప్పటికే అనేకసార్లు సమావేశమైంది.. పలు అంశాలపై చర్చించి, నివేదికలు రూపొందించి సీఎంకు అందించింది.. త్వరలో అర్హులైన లబ్ధిదారులకు హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని క్లబ్లో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఇప్పటికే అధికారులు పోడు భూముల వివరాలను పక్కాగా సేకరిస్తున్నారన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాని ఆదేశించారు.
పోడు భూముల సమస్య పరిష్కారం సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కొత్తగూడెం క్లబ్లో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీడీఏ పీవో గౌతమ్, ఎస్పీ సునీల్‌దత్, అటవీ శాఖ అధికారులు సీసీఎఫ్ భీమానాయక్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా నెలకొన్న పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పరిష్కారం దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. ఇప్పటికే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం.. సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించిందని చెప్పారు. అందులో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 8 లక్షలకు పైగా ఎకరాల్లో దాదాపు 2.35 లక్షల ఎకరాల పోడు భూములు భద్రాద్రి జిల్లాలోనే ఉన్నాయని అన్నారు. అనేక ఏళ్లపాటు అడవులు నరికివేతకు గురయ్యాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే అటవీ విస్తీర్ణం పెరిగిందని, హరితహారంతో వాటిని సంరక్షించామని గుర్తుచేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పోడు భూములు సాగు చేసుకుంటున్న వారి వివరాలు పకడ్బందీగా సేకరించాలని సూచించారు. సమగ్ర అధ్యయనం అనంతరం సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయం మేరకు అర్హులైన లబ్ధిదారులకు పోడు భూములపై హక్కులు కల్పించనున్నట్లు చెప్పారు.
ఎక్కువ అటవీ ప్రాంతం ఇక్కడే ఉంది: ఎంపీ కవిత
చిక్కుముడులుగా ఉన్న పోడు సమస్యకు పరిష్కారం చూపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మహబూబాబాద్ ఎంపీ కవిత అన్నారు. పినపాక, ఇల్లెందు ప్రాంతాల్లో పోడు సమస్య ఎక్కువగా ఉందన్నారు. అందరూ సహకరిస్తే సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చన్నారు.
భూములు చూడకుండానే పట్టాలిచ్చారు: విప్ రేగా
అప్పటి అధికారులు భూములు చూడకుండానే రైతులకు పట్టాలివ్వడం వల్ల పోడు సమస్య జటిలమైందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చిన భూములను ఫారెస్టు అధికారులు తమవని అంటున్నారని వివరించారు. పోడు సమస్యలకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శుభపరిణామమన్నారు.
పోడు విషయంలో నాపైనా కేసు పెట్టారు: ఎమ్మెల్యే వనమా
పోడు రైతులకు మద్దతు ఇచ్చినందుకు గతంలో నాపై కూడా అటవీ అధికారులు కేసు పెట్టారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఏళ్లకాలం నుంచి పోడు సాగు చేసుకుంటున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వంలో న్యాయం జరుగనుండడం అదృష్టమని అన్నారు.
8 నుంచి దరఖాస్తులు తీసుకుంటాం: భద్రాద్రి కలెక్టర్
పోడు భూములపై హక్కుల కోసం ఈ నెల 8 నుంచి దరఖాస్తులు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో దరఖాస్తులు తీసుకుంటామని, అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. పోడు సమస్య ఉన్న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. ఇల్లెందు, వైరా, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు హరిప్రియ, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడారు. అడవుల సంరక్షణపై పాల్గొన్న అధికారులు, అఖిలపక్ష నాయకులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సాబీర్‌పాషా, దుర్గాప్రసాద్, మిడియం బాబురావు, గుమ్మడి నర్సయ్య, కోనేరు నాగేశ్వరరావు, గందం మల్లికార్జున్, పూనెం శ్రీను, వీ.నారాయణ తదితరులు కూడా మాట్లాడారు.