
సర్దార్ పటేల్ స్టేడియంలో సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు
మూడు విభాగాల్లో తలపడిన బాలబాలికలు
ప్రారంభించిన సీపీ విష్ణు ఎస్ వారియర్, కేఎంసీ మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్
ఖమ్మం సిటీ, అక్టోబర్ 31: ‘రన్నింగ్, లాంగ్ జంప్, షాట్‌పుట్.. ఆట ఏదైనా అదిరిపోయే ప్రతిభ.. ఒకరిని మించిన మరొకరు. పట్టుమని పదిహేనేండ్లు నిండని పసివాళ్లు ప్రదర్శించిన అద్భుత నైపుణ్యానికి పటేల్ స్టేడియం పరవశించిపోయింది. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం 7వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. అండర్ 10, 12, 14 కేటగిరీల్లో బాలబాలికలు కలిపి మొత్తం 356 మంది హాజరయ్యారు. ఆయా పోటీలను కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, తెలంగాణ అథ్లెటిక్స్ సమాఖ్య కార్యదర్శి సారంగపాణి ప్రారంభించారు. ఒక్కో జట్టు క్రీడాకారులందరినీ పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త కురువెళ్ల ప్రవీణ్ అధ్యక్షతన సభ ఏర్పాటు చేయగా వారు మాట్లాడారు. ఖమ్మంలో ఈ తరహా ఆటల పోటీలు తరచుగా జరుగాలని ఆకాంక్షించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్నారుల్లో అత్యంత క్రీడా ప్రతిభ దాగి ఉంటుందని, అలాంటి వారిని వెలుగులోకి తీసుకువస్తే స్ఫూర్తిదాయక సమాజానికి బీజం పడుతుందని అన్నారు. తొలుత జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా అతిథులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్టేడియంలో మూడు కేటగిరీలలో బాలబాలికలకు వేర్వేరుగా రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీలను నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన చిన్నారి క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా ప్రదర్శించిన ప్రతిభ నగర వాసులను కట్టిపడేసింది. కాగా గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్స్‌ను నిర్వాహకులు అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీ, డీవైఎస్వో పరంధామరెడ్డి, సాయిమారుతి హాస్పిటల్ మేనేజ్మెంట్ బాధ్యుడు ఎస్కే రఫి, అథ్లెటిక్స్ కోచ్ ఎండీ గౌస్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.వెంకటేశ్వర్లు, ఎండీ షఫిక్ అహ్మద్, సంఘ కార్యవర్గ సభ్యులు సుధాకర్, కృష్ణయ్య, రవి, వెంకటేశ్వర్లు, రవి తదితరులు పాల్గొన్నారు.