
కృషి, పట్టుదల ఉంటేనేఈ రంగంలో రాణించగలం
వైద్యరంగంలో నూతనఒరవడి సృష్టించాలి
మున్ముందు వైద్య శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి
ఖమ్మం ‘మమత’ వైద్య కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే
రఘునాథపాలెం, అక్టోబర్ 31: సమాజ స్థాపనలో అత్యంత ఉన్నత విలువలు కలిగినది వైద్యవృత్తి అని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బీ కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వైద్య రంగంలో నూతన ఒరవడిని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం మమత కళాశాలలోని పువ్వాడ ఆడిటోరియంలో మెడికల్, డెంటల్, నర్సింగ్ కళాశాలలు ఆదివారం సంయుక్తంగా నిర్వహించిన ‘గ్రాడ్యుయేషన్ డే’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మెడికల్ వైద్య విభాగ గ్రాడ్యుయేట్లు, పీజీల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో కెల్లా వైద్య రంగం మహోన్నతమైనదని, ఎంతో కృషి, పట్టుదల ఉంటేనే ఇందులో రాణించగలమని అన్నారు. ప్రస్తుత సమాజానికి వైద్య రంగ సేవలు ఎంతో అవసరమున్నాయన్నారు. వైద్య రంగ ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకు ప్రతి విద్యార్థి తప్పక కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. విద్యార్థుల జీవితంలో ఈ రోజు ఎంతో అమూల్యమైన రోజు అని అభివర్ణించారు. వైద్య విద్యను అభ్యసించి పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టాలు పొందడం అంటే ఒక విధంగా తమ లక్ష్యాలను పూర్తి చేసుకున్నట్లేనని అన్నారు. అదే సమయంలో ఇక అంతా అయిపోయిందనుకోవడం కూడా పొరపాటని వ్యాఖ్యానించారు.
ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటిని పూర్తి చేసేందుకు పరితపించాలని పిలుపునిచ్చారు. అన్ని వసతులతో తెలంగాణలో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నది మమత కళాశాల అని కితాబిచ్చారు. రానున్న కాలంలో వైద్య రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. మమత వైద్య సంస్థల అధినేత పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సమాజానికి ఎంతో విలువైన, అమూల్యమైన వైద్యులను అందించే అదృష్టం కలిగినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం వైద్యుల కొరత ఉందని, మంచి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేది వైద్యులేనని అన్నారు. అనంతరం అతిథులు పట్టభద్రులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. మమత వైద్య విద్యా సంస్థల సెక్రటరీ పువ్వాడ జయశ్రీ, మెడికల్, డెంటల్, నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రత్నకుమారి ఫిలిప్, మెడికల్ సూపరింటెండెంట్ బాగం కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.