
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
ఉమ్మడి జిల్లా హరితమయం చేస్తాం
ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలి
సీజనల్ వ్యాధులు దరి చేరకుండా చర్యలు
అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వద్దు..
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం, జూన్ 30 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : ప్రజావసరాలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను హారితమయం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. నేటి నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో మూడు పర్యాయాలు నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఘననీయమైన మార్పు సంతరించుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో రూపరేఖలు మారిపోయాయని, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించామన్నారు. పారిశుధ్య సమస్య నుంచి విముక్తి కల్పించామని, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య సమస్య పరిష్కరానికి, రహదారులపై వంగిపొయిన, విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు ప్రమాద సూచికంగా ఉన్న గతంలో ఎవరూ పట్టించుకున్న పరిస్థితి లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ సమస్యలకు తక్షణ పరిష్కారం లభించిందని ఆయన అన్నారు.
ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక..
ప్రతి గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించి మొక్కలు నాటేలా ప్రణాళికలను సిద్ధం చేశారని, ప్రభుత్వ స్థలాల్లో కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటికి 6 చొప్పున పూల, పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, గ్రామీణ వాతావరణాన్ని కలుషితం చేసే ఈ తరహా పనులను అధికారులు అడ్డుకుంటారన్నారు. పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం పరిశుభ్రత పాటించకుండా, వ్యక్తిగత బాధ్యత లేకుండా ఇంటి వ్యర్థాలను రోడ్లపై వేసేవారిపై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
పల్లె, పట్టణ ప్రగతి పరిశీలన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, వాటర్‌ట్యాంకర్, నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథనీరు, విద్యుత్ సమస్యలు, ఇంటింటికి చెత్త సేకరణ వంటి పనులు పూర్తిస్థాయిలో అమలు జరుగుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరణించిన వారి చివరి మజిలీని గౌరవప్రదంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో ఇప్పటికే వైకుంఠధామాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏదైనా కారణాలతో వైకుంఠ ధామాలు పూర్తికాని పక్షంలో తక్షణం పూర్తి చేయాలన్నారు. ఈ పది రోజుల్లో వాటిని వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించినట్లు మంత్రి వివరించారు.
ప్రకృతి వనాలు వరం
గ్రామీణ ప్రాంతాలకు పల్లె ప్రకృతి వనాలు వరం లాంటివని, వాటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో ప్రజల నుంచి వచ్చే వినతులు, సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం మంత్రులకు రూ.2 కోట్లు, కలెక్టర్లకు రూ.కోటి ప్రత్యేక నిధులు మంజూరు చేశారని, జిల్లా ప్రజల తక్షణ అవసరాలకు వినియోగించుకుంటామని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలతో వర్మీకంపోస్టు తయారీని ప్రోత్సహిస్తున్నామన్నారు. 7వ విడత హరితహారంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటనున్నామని ఆయన పేర్కొన్నారు. పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉంటే సీజనల్ వ్యాధులు దరిచేరవన్నారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ నిరంతరం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
పేదల పెన్నిధి కేసీఆర్
దళితుల కోసం రూ.1200 కోట్లను కేటాయించి వారి అభ్యున్నతికి వినియోగించుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది. సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా, దళితుల సమస్యలు తెలిసిన నేతగా ప్రజల అభినందనలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అధికారులు పల్లె నిద్రకు ప్రాధాన్యం ఇచ్చి ఉదయం జరిగే పారిశుధ్య నిర్వహణ కార్యక్రమం పరిశీలిస్తారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు అగ్రగామిగా ఉండేందుకు అహర్నిశలు శ్రమిస్తానని ఆయన అన్నారు.