రఘునాథపాలెం, సెప్టెంబర్ 9: పరిపాలనా సౌలభ్యం కోసం రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి శుక్రవారం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను మంత్రి పర్యవేక్షించారు. మూడు ఫ్లోర్లూ కలియతిరిగి జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్లాన్ ప్రకారం పనులు కొనసాగుతున్నాయా లేదా అని ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ నూతన కలెక్టరేట్ భవనాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఖమ్మంలో రూ.44 కోట్ల వ్యయంతో 1.69 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పనులు చాలా అలస్యమైనందున మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించుకోనున్నామన్నారు. అందుకని ఏ ఒక్క పని కూడా పెండింగ్ ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆర్అండ్బీ జేఈ విశ్వనాథ్, వీవీ పాలెం సర్పంచ్ రావెళ్ల మాధవి, టీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, తొలుపునూరి దానయ్య, వాంకుడోత్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.