సిద్ధమవుతున్న ఖమ్మం నూతన కలెక్టరేట్
ముమ్మరంగా నిర్మాణ పనులు
ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమ్
ఖమ్మం, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం కొత్త కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం సమీపంలో వీవీపాలెం వద్ద 20 ఎకరాల 18 కుంటల భూమిని ప్రభుత్వం సేకరించింది. రూ.35 కోట్ల అంచనా వ్యయంతో ఆర్‌అండ్‌బీశాఖ సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను చేపట్టింది. ఇప్పటివరకు రెండు అంతస్తుల భవనం నిర్మించి ఇంటీరియల్ పనులపై దృష్టిసారించింది. అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఖమ్మం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రం సమీపంలో వీవీపాలెం వద్ద 20 ఎకరాల 18 కుంటల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఎకరానికి రూ.కోటి చొప్పున వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ విషయమై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా చివరకు కలెక్టరేట్ నిర్మాణం అక్కడే చేపట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో సమీకృత కలెక్టర్ కార్యాలయం భవన నిర్మాణ బాధ్యతను ఆర్అండ్బీ శాఖ చేపట్టింది. రూ.35 కోట్ల అంచనా వ్యయంతో కలెక్టరేట్ నిర్మాణం జరుగుతోంది. దీని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు 2018 మార్చిలోనే పరిహారాన్ని అందించింది. ఏప్రిల్‌లో పనులు మొదలయ్యాయి. తర్వాత కోర్టులో కేసుతో నిర్మాణ పనులు కొంత ఆలస్యమయ్యాయి.
కోర్టు తీర్పు అనంతరం నిర్మాణం ప్రారంభమైనా కరోనా విజృంభన వంటి కారణాలతో మరికొంత వేగం తగ్గింది. భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం దశలవారీగా నిధులు మంజూరు చేయడంతో పనులు సత్వరం పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ ఈ కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.35 కోట్ల వ్యయంతో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తుల భవనాలను నిర్మించేలా ఒప్పందం కుదిరింది. అయితే నిర్మాణ సంస్థ ఇప్పటివరకు రెండు అంతస్తుల భవనం నిర్మించి ఇంటీరియల్ పనులపై దృష్టి సారించింది. ఈ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేలా నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న రోడ్లు, భవనాల శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు.
కలెక్టరేట్ నిర్మాణం ఇలా..
అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. 1,59,026 చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో కార్యాలయంతోపాటు సమావేశ మందిరం నిర్మిస్తున్నారు. మొదటి, రెండు అంతస్తుల్లో కార్యాలయ గదులతోపాటు సమావేశ మందిరాలు నిర్మిస్తున్నారు. సందర్శకుల గది, సువిశాలంగా వీడియో కాన్ఫరెన్స్ హాల్ వంటి వాటిని నిర్మిస్తున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులకు ఆధునిక హంగులతో ప్రత్యేక చాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. సమీకృత కలెక్టరేట్‌లోకి పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను మార్చనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులను కలెక్టర్ వీపీ గౌతమ్ ఇటీవల పరిశీలించారు. నాణ్యత, పనుల తీరు గురించి ఆర్అండ్బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసేలా చేయాలని ఆదేశించారు.