యూనిట్లపై అవగాహన కల్పించాలి
ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించాలి
‘మన ఊరు-మన బడి’ అమలు అందరి బాధ్యత
జిల్లాలో మొదటి దశలో 426 పాఠశాలలు ఎంపిక
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
‘దళితబంధు’ అమలు, ‘మన ఊరు- మన బడి’ విధి విధానాలపై సమీక్ష
ఖమ్మం, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితబంధు పథకంలో లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని, యూనిట్లపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో దళిత బంధు అమలు, ఎంపిక, ‘మన ఊరు-మన బడి’ విధి విధానాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో లబ్ధిదారుల ఎంపికలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. శాసనసభ్యులు సూచించిన లబ్ధిదారుల జాబితాను వెంటనే పంపించాలని పేర్కొన్నారు. ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా సీఎం కేసీఆర్ రూ.7,600 కోట్లు కేటాయించారని తెలిపారు. ‘మన ఊరు-మన బడి’ అమలు బాధ్యత మన అందరిదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. దళితబంధు అమలు, ఎంపికలు, తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, అధికారులతో ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 500 మంది లబ్ధిదారులను త్వరితగతిన ఎంపిక చేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే సూచించిన లబ్ధిదారుల జాబితా ప్రకారం ఆయా గ్రామాల్లో వారి వివరాలు సేకరించి వెంటనే పంపించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చింతకాని మండలంలోని లబ్ధిదారులతోపాటు ఐదు నియోజకవర్గాల్లోని 500 మంది లబ్ధిదారులకు ఆసక్తి ఉన్న, వ్యాపారానికి అనుకూలంగా ఉన్న రంగాల్లో యూనిట్ల స్థాపనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
జాబితా ఆధారంగా లబ్ధిదారులు వెంటనే బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో వారికి అవగాహన కల్పించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు చోటులేదన్నారు. మొదటి విడత లబ్ధిదారుల యూనిట్లు స్థాపించే క్రమంలో రెండో విడత దళితబంధు లభ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. మంజూరు చేసిన రూ.10 లక్షలతో లబ్ధిదారులు ఎన్ని యూనిైట్లెనా నెలకొల్పుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీలు తాతా మధు, నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మేయర్ నీరజ, అదనపు కలెక్టర్ మధుసూదన్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఎస్సీ అభివృద్ధి అధికారి కస్తాల సత్యనారాయణ పాల్గొన్నారు.