
మామిళ్లగూడెం, అక్టోబర్19 : ఈ నెల 21వ తేదీ నుంచి పది రోజులు ఫ్లాగ్‌డే నిర్వహణ కోసం పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నేషనల్ ఫ్లాగ్‌డే సందర్భంగా మొదటి రోజు కరపత్రాలు, పోస్టర్లు విడుదల చేయడంతోపాటు పోలీస్ హెడ్‌క్వార్టర్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద ఫ్లాగ్‌డే పరేడ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. గాయపడిన, మృతిచెందిన పోలీసు కుటుంబాల ఇండ్లకు 22వ తేదీ నుంచి 24 వరకు వెళ్లి పరామర్శిస్తామన్నారు. యోగ క్షేమాలు, సంక్షేమం గురించి తెలుసుకుంటామని, సమస్యలు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. 23వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సబ్ డివిజన్లలో రక్తదాన శిబిరాలు ఉంటాయన్నారు. 25న తేదీన సైకిల్ ర్యాలీ, 26న ఆన్లైన్ ఓపెన్ హౌస్, 27, 28 తేదీల్లో పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తారని, ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారన్నారు. 28వ తేదీన పాఠశాల, కళాశాల విద్యార్థులకు ‘జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర ’ అనే అంశంపై ఆన్లైన్లో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. https://forms.gle/uJj58xXN1GQPNjp8A లింకు ద్వారా పాల్గొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వ్యాసాన్ని రాష్ట్ర పోలీస్ అధికారిక ఫేస్బుక్లో ప్రచురించనున్నట్లు చెప్పారు. పోలీసులకు సంబంధించిన షాట్ఫిల్మీంలో ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మూడు నిమిషాల నిడివితో పోలీసుల సేవలు, త్యాగాలు ప్రతిబింబించేలా రూపొందించిన చిత్రాలు, షార్ట్ ఫిల్మీంలు పంపించాలని సూచించారు. వీటిని సీడీ రూపంలో రాష్ట్ర పోలీస్ వెబ్సైట్, ఖమ్మం జిల్లా పోలీస్ వెబ్‌సైట్‌కు ఈ నెల 30వ తేదీ వరకు సమర్పించాలని సూచించారు.