కూసుమంచి, నవంబర్ 8: కార్తీక పౌర్ణమి వేడుకలు రెండో రోజూ కొనసాగాయి. మంగళవారం కార్తీక పౌర్ణమి అయినప్పటికీ ఈ రోజు చంద్ర గ్రహణం ఉండడంతో చాలా మంది భక్తులు సోమవారమే కార్తీక పూజలు చేశారు. మంగళవారం ఉదయం కొందరు భక్తులు దీపాలు వెలిగించారు. కూసుమంచిలోని పురాతన శివాలయం సోమవారం సాయంత్రం నుంచే భక్తులతో కిటకిటలాడింది. ఖమ్మం సహా ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు.
దీంతో అర్ధరాత్రి వరకు భక్తుల సందడి కనిపించింది. దీపాల వెలుగులో ఆలయం కొత్త శోభను సంతరించుకున్నది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు జ్వాలాతోరణం, ఆకాశదీపం వెలిగించారు. ఇంటెలిజెన్స్ డీసీపీ సాయిబాబా సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ముఖమండపంలో లింగాకారంలో ఒత్తులు వెలిగించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్ మంగళవారం సతీసమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం భక్తులు రావడంతో అభిషేకం నిర్వహించారు.