పగిడిద్దరాజు మేడారం చేరికతో ప్రారంభంకానున్న సమ్మక్క-సారలమ్మ జాతర
గుండాల, ఫిబ్రవరి 14 : మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి అవినాభావ సంబంధం ఉంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజు యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయులకు చెందిన వారు. దీంతో ఇక్కడి అరెం వంశీయులు ప్రతి జాతరకు పగిడిద్ద రాజును గుడి నుంచి గద్దెలపై చేర్చి పూజలు చేసి, ఇక్కడి నుంచి మూడురోజులపాటు కాలి నడకన డోలీల చప్పుళ్లతో మేడారం తీసుకెళ్తారు. గిరిజన సంప్రదాయం ప్రకారం అక్కడ ఎదుర్కోళ్లు నిర్వహించి పగిడిద్దరాజు-సమ్మక్కకు వివాహం జరిపిస్తారు. మేడారంలో నాగవెల్లి జాతరను నిర్వహించి వన దేవతలకు మొక్కులను చెల్లించుకుంటారు.
కాలి నడకన మేడారం పయనం
పెళ్లికొడుకు పగిడిద్దరాజును యాపలగడ్డ సమీప బర్ల గుట్టపై నుంచి సోమవారం ఉదయం గుడికి తరలించారు. పగిడిద్దరాజు ఆభరణాలను శుద్ధి చేసి పూజలు చేశారు. అక్కడి నుంచి ఇదే గ్రామంలో తొట్టివాగు వద్ద ఉన్న గద్దెల వద్దకు పగిడిద్దరాజును తీసుకెళ్ళి గద్దెలపై నిలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పగిడిద్ద రాజును పడగలు, డోలీల చప్పుళ్లతో కాలినడకన మేడారం సుమారు 75 కిమీ ప్రయాణం ప్రారంభించారు. యాపలగడ్డ గ్రామం నుంచి సోమవారం పగిడిద్దరాజుతో బయలుదేరిన అరెం వంశీయులు గుండాల, నర్సాపురం, నర్సాపురం తండా, రోళ్ళగడ్డ, దేవలగూడెం, దుబ్బగూడెం, మామిడిగూడెం, లింగాల మీదుగా రాత్రికి రాత్రి కొడిసెల గ్రామం చేరుకుంటారు. రెండో రోజు అంకన్నగూడెం, జగ్గన్నగూడెం, మీదుగా నార్లాపూర్ చేరుకొని అక్కడ నిద్ర చేస్తారు. ఈ నెల 16న పగిడిద్దరాజు మేడారం గద్దెల వద్దకు రాత్రి 9గంటలలోపు చేరుకోవడంతో అక్కడ మేడారం జాతర మొదలవుతుంది. జాతర ముగిసిన అనంతరం తిరిగి కాలి నడకన పగిడిద్ద రాజును పూర్వ స్థానానికి తీసుకొచ్చి మార్చి మొదటివారంలో యాపలగడ్డ వద్ద పగిడిద్దరాజు జాతరను ఘనంగా నిర్వహిస్తారు.