ఖమ్మం జిల్లాలో మొదటి దశలో 426 స్కూళ్లు ఎంపిక
12 అంశాల పనులకు అధికారులకు నివేదిక సిద్ధం చేయాలి
ఇక ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య ఉండేలా కృషిచేయాలి
సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘మన ఊరు – మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వంతో మనమూ బాధ్యత తీసుకుందామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సర్కారు బడుల్లో చదువుకొని ఉన్నతస్థాయికి వెళ్లి వారు తమ వంతు చేయూతనందిస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు దీటుగా విద్యనందిస్తాయని అన్నారు. ‘మన ఊరు – మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ అమలుపై జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, ఏజెన్సీల ఈఈలతో ఖమ్మం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. తొలుత పథకం విధివిధానాలు తెలియజేసి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9,123 పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రాష్ట్ర మొదటి దశలో రూ. 3,497 కోట్లను కేటాయించిందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మూడు దశల్లో చేపట్టే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రూ.7,600 కోట్లు కేటాయించారన్నారు.
ఈ కార్యక్రమం కింద 12 కాంపోనెంట్స్ పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రాధాన్య పరంగా ఎంపిక చేసిన పనుల్లో నీటి సదుపాయంతో మరుగుదొడ్లు, విద్యుచ్చక్తి, తాగునీటి సరఫరా, ఫర్నీచర్, పాఠశాల భవన పెయింటింగ్, మేజర్ మైనర్ మరమ్మతులు, గ్రీన్‌చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీలు, కిచెన్ షెడ్ల నిర్మాణం, డైనింగ్ హాళ్లు, నూతన తరగతి గదులు, డిజిటల్ విద్య అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. జిల్లాలో విద్యార్థుల నమోదు ఆధారంగా మొదటి విడతలో జిల్లాలో 426 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ పరిధిలో మొదటి దశలో ఎంపికైన పాఠశాలల్లో ఎస్ఎంసీలు, మండల విద్యాశాఖాధికారులతో సమావేశమై ఈ పథకం కింద చేపట్టనున్న పనులను గుర్తించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు, ప్రవాస భారతీయుల సహకారం తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ప్రభుత్వం సూచించిన 12 కాంపోనెంట్స్ పనులను గుర్తించి చేపట్టేందుకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో మండలాల వారీగా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను నియమించినట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
కార్యక్రమ నిర్వహణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక బ్యాంక్ ఖాతా, పాఠశాలల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలకు రెండు నూతన బ్యాంక్ ఖాతాలు ప్రారంభించినున్నట్లు చెప్పారు. దాతలను ప్రోత్సహించి ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, భట్టి విక్రమార, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, ఎమ్మెల్సీలు తాతా మధు, నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తమ సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ‘మన ఊరు – మన బడి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేఎంసీ మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ , డీఆర్వో శిరీష, డీఈవో యాదయ్య, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు చంద్రమౌళి, శ్యాంప్రసాద్, కేవీకే శ్రీనివాస్, పుష్పలత, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.