
ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. రాత్రి 8 గంటల వరకు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద దరఖాస్తుదారులు బారులు తీరారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే సమయానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.200 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఖమ్మం జిల్లా నుంచి 6214 దరఖాస్తులు రాగా.. రూ.125 కోట్లు ఆదాయం వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి దాదాపు 4306 దరఖాస్తులు దాఖలయ్యాయి. రూ.86 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. గురువారం మంచి రోజు, చివరి తేదీ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి మద్యం వ్యాపారం నిర్వహించాలనే ఆసక్తి కలిగినవారు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది కుటుంబసభ్యుల పేర్లతో, మహిళల పేర్లతో దరఖాస్తు చేశారు.
లాటరీ ద్వారా ఎంపిక
ఖమ్మం జిల్లాలో 122, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన లాటరీ ద్వారా దరఖాస్తులను ఎంపిక చేసి దుకాణాలు కేటాయిస్తారు. గత ఎక్సైజ్ సంవత్సరం కంటే ఈ సారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలు పెరగడంతోపాటు అదే రీతిలో దరఖాస్తులు పెద్దసంఖ్యలో దాఖలయ్యాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముదిగొండ మండలం వల్లభిలోని మద్యం దుకాణానికి 118 దరఖాస్తులు దాఖలయ్యాయి. మధిరలోని రాజుపాలెం మద్యం దుకాణానికి 117 దరఖాస్తులొచ్చాయి. ఎర్రుపాలెంలోని 77 నెంబర్ దుకాణానికి 116 దరఖాస్తులు రావడం విశేషం. ఇదే తరహాలో ప్రతి మద్యం దుకాణానికి కనీసం 50 నుంచి 55 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన ఆబ్కారీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలను పెంచింది. దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తులు స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీ నుంచి ఎక్సైజ్ అధికారులు దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఆంధ్రా సరిహద్దు దుకాణాలకు పోటీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని మద్యం దుకాణాల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అశ్వారావుపేట, దమ్మపేట, భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో ఒక్కొక్క దుకాణానికి 30 నుంచి 40 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన దుకాణాల్లోనూ పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే వెసులుబాటు కల్పించడంతో మద్యం దుకాణాలకు పోటీ పెరిగింది. ఖమ్మం, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు పెద్దఎత్తున దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు, ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి, కొత్తగూడెం అసిస్టెంట్ కమిషనర్ నర్సింహారెడ్డిలు పర్యవేక్షించారు.
2019లో 4303 దరఖాస్తులు..
2019లో ఖమ్మం జిల్లాలో 89 దుకాణాలకు గాను 4,303 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.86 కోట్ల ఆదాయం సమకూరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 76 మద్యం దుకణాలకు 3,408 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత సంవత్సరంలో దరఖాస్తుల ద్వారా రూ.154 కోట్ల 22 లక్షల ఆదాయం సమకూరింది.