ఆస్పత్రుల అవసరాలపై నివేదిక అందజేయాలి
పరిసర గ్రామాల ప్రజలకు ఇక్కడే వైద్యం అందించాలి
ఆకస్మిక పర్యటనలో కలెక్టర్
100 పడకల ఆస్పత్రి, బృహత్ ప్రకృతి వనం పరిశీలన
మణుగూరు రూరల్, ఫిబ్రవరి 18: మణుగూరులోని వంద పడకల ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాల ని, పేషెంట్లను అత్యవసరమైతేనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించాలని డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(డీసీహెచ్ఎస్) డాక్టర్ ముక్కంటేశ్వరరావును కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. “ఇక్కడి పేషెంట్లను అవసరం లేనప్పటికీ భద్రాచలం ఏరియా ఆస్పత్రికి పంపిస్తే.. అక్కడి వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుంది. పేషెంట్లు, వారి కుటుంబీకులపై ఆర్థిక భారం పడుతుంది” అన్నారు. మణుగూరులోని వంద పడకల ఆస్పత్రిని శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. లేబర్, మార్చురీ తదితర గదులను పరిశీలించారు. అక్కడ ఏమేమి సౌకర్యాలు అవసరమో తెలుసుకున్నారు. ఆక్సీజన్ ప్లాంట్ పరిశీలించారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. ఆస్పత్రిలో మార్చి 1వ తేదీ నాటికి పారిశుధ్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆస్పత్రి ఆవరణ చుట్టూ విరివిగా మొక్కలు నాటించాలని ఎంపీడీవో వీరబాబుతో చెప్పారు. సింగరేణి అధికారులతో మాట్లాడి, ఆస్పత్రి ఆవరణను చదును చేయించాలని తహసీల్దార్ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. ముత్యాలమ్మ నగర్‌లోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మండల ప్రత్యేకాధికారి రమాదేవి, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ మాధవి, సూపరింటెండెంట్ గిరిప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ శిరీష, నేత్ర వైద్యాధికారి డాక్టర్ సంజీవరావు, ఎం పీవో పల్నాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.