
భద్రాద్రి జిల్లాలో యువతను ఆకర్షిస్తున్న ముఠాలు
బంతి బంతికో రేటు
ఈ ఐపీఎల్ సీజన్ వేదికగా దందా
జిల్లావ్యాప్తంగా ఏడుగురిపై కేసులు
ఉక్కుపాదం మోపుతామంటున్న పోలీస్‌శాఖ
సుజాతనగర్,అక్టోబర్ 8 ;ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ దందా.. ఇప్పుడు మారుమూల పల్లెలకూ పాకింది. భద్రాద్రి జిల్లాలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ జోరుగా సాగుతున్నది. పలు ముఠాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ యువతకు వల వేస్తున్నాయి. ఏరోజు ఏ టీం గెలుస్తుంది? ఎన్ని పరుగులు చేస్తుంది? ఏ బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు? నెక్ట్స్ బాల్ సిక్సా ? ఫోరా ? వికెటా? అనే అంశాలపై బెట్ కాస్తున్నారు. బెట్టింగ్ ముఠా అంశానికో రేటు నిర్ణయించినట్లు సమాచారం. రూ.100 నుంచి మొదలుకొని రూ.లక్షల వరకు బెట్ కాస్తున్నారు. అంతేకాదు, బెట్టింగ్ విషయం బయటకు రాకుండా కోడ్ భాషను వినియోగిస్తున్నారు. అనుమానం రాకుండా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు బదిలీ చేసుకుంటున్నారు.
కొత్తగూడేనికి చెందిన ఓ యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. వచ్చే కాస్త జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. బెట్టింగ్‌లో రూ.వందకు రూ.వెయ్యి, రూ.వెయ్యికి రూ.10 వేలు వస్తాయని విని అటు వైపు ఆకర్షితుడయ్యాడు. అప్పులు చేసి బెట్టింగ్‌లు పెట్టాడు. అప్పుల పాలయ్యాడు. బెట్టింగ్‌కు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. కుటుంబం రోడ్డున పడింది.
పాల్వంచకు చెందిన ఓ విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. బాగా చదువుతాడని అతనికి మంచి పేరున్నది. కానీ ‘ఈజీ మనీ’ కావాలనుకున్నాడు. స్నేహితుల ద్వారా అందినంత డబ్బు తీసుకుని క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. ఒకటి రెండు సార్లు బెట్టింగ్‌లో డబ్బులు రావడంతో ఇంకా ఉత్సాహంగా బెట్టింగ్ పెట్టాడు. క్రమంగా అప్పుల్లో మునిగిపోయాడు. తీర్చలేనని తెలిసి చివరికి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు..
భద్రాద్రి జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతున్నది. ఒకప్పుడు పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ ఇప్పుడు మారుమూల గ్రామాలకూ విస్తరిస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ బెట్టింగ్‌కు వేదికగా మారింది. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, జూలూరుపాడు, చండ్రుగొండ, సుజాతనగర్, చుంచుపల్లి తదితర మండలంలో జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం.
బంతికి బంతికి బెట్..
జిల్లా నలుమూలల నుంచి బెట్టింగ్ ముఠా బృందాలుగా ఏర్పడుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ యువతను ఆకర్షిస్తున్నాయి. ఎవరికీ తెలియని రిమోట్ ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తున్నాయి. ఐపీఎల్లో భాగంగా ఏరోజు ఏ టీం గెలుస్తుంది? ఎన్ని పరుగులు చేస్తుంది? ఏ బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు? నెక్ట్స్ బాల్ సిక్సా ? ఫోరా ? అనే అంశాలపై బెట్ కాస్తున్నాయి. బెట్టింగ్ ముఠా పరుగు పరుగుకు ఒక రేటు, బంతి బంతికి ఒక రేటు, వికెట్, టాస్.. ఇలా ప్రతి అంశానికో రేటు నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఈ బెట్లు రూ.100 నుంచి మొదలుకొని రూ.లక్షలు దాటుతున్నది. కొన్ని బెట్టింగ్ ముఠాలు యువకుల నుంచి రూ.100 బెట్టింగ్ పెట్టిస్తూ వారు గెలిస్తే రూ.వెయ్యి వరకు ఇస్తున్నట్లు సమాచారం. అయితే.. రూ.100 ఎక్కువ మంది బెట్ కాయడం, తక్కువ మంది గెలుస్తుండడంతో బెట్టింగ్ ముఠాలకు కలిసివస్తున్నది.
అంతా కోడ్ భాషే..
బెట్టింగ్‌లకు ఎక్కువ మంది మొబైల్‌ను వినియోగిస్తున్నారు. ఎవరితో బెట్టింగ్ చేయదలచుకుంటున్నారో వారికి సామాజిక మాధ్యమాలు, మెసెంజర్ల ద్వారా సమాచారం ఇచ్చుకుంటున్నారు. బెట్టింగ్ విషయం బయటకు రాకుండా కోడ్ భాషను వినియోగిస్తున్నారు. పోలీసులకు చిక్కవద్దనే ఉద్దేశంతో కొత్త భాషను సృష్టిస్తున్నారు. బెట్టింగ్‌ల ద్వారా బుకీలకు లాభం చేకూరుతుండగా పేద, మధ్యతరగతికి చెందిన యువకులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈజీ మనీకి అలవాటుపడి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు.
ఏడు కేసులు నమోదు..
క్రికెట్ బెట్టింగ్‌పై పోలీస్‌శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. బెట్టింగ్‌పై జిల్లాలోని సుజాతనగర్ మండలంలో ఇప్పటికే ఐదు కేసులు,చుంచుపల్లి మండలంలో రెండు కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ ఆడేవారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. బెట్టింగ్‌పై ఎవరికీ అనుమానం రాకుండా ఫోన్ పే, గూ గుల్ పే ద్వారా నగదు బదిలీలు చేసుకుంటున్నారు.
బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు..
ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పీఎస్ గేమ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. భద్రాద్రి జిల్లాలో ఇప్పటివరకు ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. వారి వద్ద నుంచి రూ.1.40 లక్షల బెట్టింగ్ నగదు స్వాధీనం చేసుకున్నాం. బెట్టింగ్‌పై పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం.
-వెంకటేశ్వరబాబు, కొత్తగూడెం డీఎస్పీ