త్వరలో ఎరువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం
అన్నదాతలపై మరింత పెరుగనున్న ఆర్థికభారం
సాగు విస్తీర్ణం పెరగడంతో రసాయనిక ఎరువులకు డిమాండ్
నిరుడు జిల్లాలో 1,88,230 మెట్రిక్ టన్నుల వినియోగం
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 20 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విస్మరించడంతోపాటు రైతులపై ఆర్థిక భారం మోపే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రసాయనిక ఎరువులపై ఇస్తున్న సబ్సిడీలకు భారీగా కోత విధించింది. ఫలితంగా వచ్చే వానకాలం సీజన్‌కు రసాయనిక ఎరువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదివరకే ఎరువుల ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కేంద్రం ఎరువులపై సబ్సిడీ కోత విధించడంతో త్వరలో రసాయనిక ఎరువుల ధరలు మరింత పెరగనున్నాయి. ఇది రైతులకు పెనుభారం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి సాయమూ అందడం లేదు. పైగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే విధానాలను తీసుకురావడం వంటి కారణాలతో రైతులు సైతం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. చెరువుల ఆయకట్టు పెంచడంతో ఇటీవల సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో చిన్న నీటి వనరుల ద్వారా సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.మొత్తం 4,61,850 ఎకరాల్లో ఏటా రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. అత్యధికంగా పత్తిని పండిస్తున్నారు. దిగుబడితోపాటు గిట్టుబాటు ధర రావడంతో రైతులు పత్తిపై లాభాలను చూశారు. తెలంగాణ ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేయడంతోపాటు రైతుబంధు సాయం అందిస్తోంది. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎరువుల ధరలు తగ్గించడం లేదు. పైగా ఈ ధరలను ఏటా పెంచడంతోపాటు సబ్సిడీలను పూర్తిగా ఎత్తేసింది. దీంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రంపై కర్షకులంతా కన్నెర్ర జేస్తున్నారు.
బడ్జెట్లో సబ్సిడీ నిధులకు కోత
కేంద్రం తాజాగా ప్రకటించిన బడ్జెట్లో ఎరువులపై సబ్సిడీకి భారీగా కోత విధించింది. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో ఎరువులపై సబ్సిడీ నిధుల్లో రూ.29 వేల కోట్లు తక్కువగా కేటాయించింది. దీంతో ఎరువులపై రాయితీ తగ్గి ధరలు పెరగనున్నాయి. వచ్చే వానకాలం సీజన్ నుంచి ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. దీనికి తోడు కొన్ని రకాల ఎరువులపై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే యోచనలో కేంద్రం ఉంది. అదే జరిగితే రైతులపై మరింత ఆర్థికభారం పడనుంది. నిరుడు కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను 50 శాతం మేర పెంచింది. తాజాగా ఎరువుల రాయితీకి నిధులను తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో యూరియా సబ్సిడీ రూపేణా కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్లో రూ.68 వేల కోట్లు కేటాయించింది. కాంప్లెక్స్ ఎరువులకు గతేడాది బడ్జెట్లో రూ.84 వేల కోట్ల సబ్సిడీ కేటాయిస్తే తాజాగా కేవలం రూ.42 వేల కోట్లు ప్రకటించింది. సబ్సిడీ నిధులు భారీగా కోత విధించడంతో ధరలు మరింత పెరిగి రైతులకు భారం తప్పదని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రైతులు, రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా ధరలు పెరిగితే సాగు కష్టమే..
కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను నియంత్రించాలి. బడ్జెట్లో సబ్సిడీ కేటాయింపులు తగ్గించడం వల్ల ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. సాగు పెట్టుబడి కంటే ఎరువుల ధరలే ఎక్కువ అవుతున్నాయి. దీంతోపాటు పండించిన పంటలను కొనుగోలు చేయబోనని కేంద్రం చెప్పడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కష్టాలను కేంద్ర ప్రభుత్వం ఆలకించాలి. అన్నదాతల సమస్యలను అర్థం చేసుకోవాలి.
–నంబూరి శేఖర్, రైతు, శింగభూపాలెం